ఇప్పుడు ఏపీ రాజకీయాలన్నీ దేవాలయాలపై దాడుల ఘటన చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో అధికార వైసీపీని టార్గెట్ చేసేందుకు బీజేపీ జనసేన కూటమి, టీడీపీ ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ఘటన కారణంగా రాజకీయంగా తమకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు వైసీపీ కూడా చర్యలు మొదలుపెట్టింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. రామతీర్థం ఘటన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీ కీలక నిర్ణయం తీసుకునేలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో జరుగుతున్న పరిణామాలను రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. దీని ప్రభావంతో రాబోయే తిరుపతి ఉప ఎన్నికల్లో రాజకీయంగా ఎంతో కొంత మేర లబ్ది పొందాలని బీజేపీ యోచిస్తున్నట్టు సమాచారం.
అయితే ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై బీజేపీ అనుకున్న స్థాయిలో స్పందించలేకపోతోందనే భావన ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఉందనే వార్తలు వినిస్తున్నాయి. ఈ అంశంలో తమ కంటే టీడీపీ ముందుండి నిరసనలు చేపట్టడాన్ని కూడా బీజేపీ నాయకత్వం గమనిస్తోందని.. అందుకే ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఢిల్లీ పిలిచి క్లాస్ తీసుకుందని ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నిరసనల ద్వారా ప్రజల్లోకి ఎందుకు అంత గట్టిగా వెళ్లలేకపోతున్నారని బీజేపీ నాయకత్వం సోము వీర్రాజును వివరణ కోరినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఏపీ బీజేపీ నాయకత్వాన్ని నమ్ముకోకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న బండి సంజయ్‌ను రంగంలోకి దింపాలని బీజేపీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల ఏపీ పరిణామాలపై బండి సంజయ్ తరచూ స్పందించడం వెనుక అసలు కారణం కూడా ఇదేనని పలువురు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో తాను బీజేపీ అధ్యక్షుడు అయిన తరువాత మంచి ఫలితాలు సాధించారు బండి సంజయ్. కేసీఆర్ సర్కారును విమర్శంచడంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు కూడా సాధించారు. దీంతో ఏపీలోనూ బండి సంజయ్‌ను రంగంలోకి దింపాలని బీజేపీ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ముందుగా తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ గెలుపు బాధ్యతను బండి సంజయ్‌కు అప్పగించి.. ఆ తరువాత ఫలితాలపై అధ్యయనం చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇందుకు బండి సంజయ్ కూడా సుముఖంగానే ఉన్నారని కొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు ఏపీ బీజేపీలోని అనేక మంది నేతల నుంచి తనకు సహకారం లభించడం లేదని.. ఈ కారణంగానే తాను ఆశించిన స్థాయిలో ఫలితాలను చూపించలేకపోతున్నానని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన భావిస్తున్న బీజేపీ.. ఇందుకోసం ఊహించని ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bandi sanjay, Tirupati Loksabha by-poll