HOME »NEWS »ANDHRA PRADESH »telangana and andhra pradesh rtc officials may make temporary agreement to run buses for dussera season ak

APSRTC-TSRTC: ఏపీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య దసరా ఒప్పందం ?

APSRTC-TSRTC: ఏపీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య దసరా ఒప్పందం ?
ఏపీ, తెలంగాణ ఆర్టీసీ మధ్య దసరా ఒప్పందం ?

ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైనా... బస్సు సర్వీసుల విషయంలో ఒప్పందాలను పునర్ సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుండటంతో ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు.

  • Share this:
    కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు.. ఇంకా ప్రారంభం కాలేదు. ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమైనా... బస్సు సర్వీసుల విషయంలో ఒప్పందాలను పునర్ సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతుండటంతో ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు పలుసార్లు సమావేశమైనప్పటికీ.. ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు. తాజాగా నేడు మరోసారి హైదరాబాద్ బస్ భవన్‌లో ఇరు రాష్టాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం కానుండటంతో.. ఈ సమావేశంలో అయినా దీనిపై ఏకాభిప్రాయం కుదురుతుందా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

    అయితే ఈ అంశంపై ఏకాభిప్రాయం రాకపోయినప్పటికీ.. దసరా పండగ నేపథ్యంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై తాత్కాలిక ఒప్పందం చేసుకోవడానికి ఇరు రాష్ట్రాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రోజుకు 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు నడుపుతామని... ఏపీఎస్‌ఆర్టీసీ కూడా అన్ని కిలోమీటర్లకే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు సూచిస్తున్నారు. కానీ అందుకు ఏపీ అధికారులు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో అధికారుల స్థాయిలో మరోదఫా చర్చలు నిర్వహించాలని గతంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణకు రోజూ 375 బస్సులను నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ 206 సర్వీసులకు మాత్రమే పరిమితం కావాలని తెలంగాణ అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు. ఐతే మిగిలిన మార్గాల్లో తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుపుతుందా? లేదా? అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని ఏపీ అధికారులు కోరుతున్నారు. ఎవరూ బస్సులు నడపకుంటే ప్రైవేట్ ట్రావెల్స్‌కు లాభం చేకూరుతుదని అభిప్రాయపడుతున్నారు. దీనిపై తెలంగాణ నుంచి స్పష్టత లేదని చెబుతున్నారు.



    అయితే ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో చర్చలు సఫలం కాకపోవడంతో.. ఏపీ మినహా ఇతర పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటకలకు బస్సులు నడపాలని కొద్దిరోజుల క్రితమే తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని బెంగళూరు కాకుండా మైసూరు, గంగావతి, బీదర్, గుల్బర్గా, రాయచూరు ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి. మహారాష్ట్రలో.. ముంబై, పుణె, నాగపూర్, నాందేడ్, చంద్రపూర్ షిర్డీలకు బస్సులు వెళ్తాయి. దీని వల్ల టీఎస్ఆర్టీసికి రోజూ రూ.40లక్షల నుంచి రూ.50లక్షల దాకా ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

    మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కావాలంటే.. దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. మొత్తానికి అటు తెలంగాణ, ఇటు ఏపీ రాష్ట్రాలు సర్వీసుల నిష్పత్తి విషయంలో ఏకాభిప్రాయానికి వస్తేనే ఇరు రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయిలో మళ్లీ ఆర్టీసీ బస్సులు తిరిగేలా కనిపిస్తోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:October 07, 2020, 14:21 IST

    टॉप स्टोरीज