Home /News /andhra-pradesh /

TDP YCP AND JANASENA ANALYSE POLLS TO SPECULATE VOTERS SUPPORT IN ANDHRA PRADESH NK

పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్

జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్

Lok Sabha Election 2019 : మే 23 కోసం ఎదురుచూస్తున్న వివిధ పార్టీల నేతలు... ఈ లోపే రకరకాల లెక్కలు వేసుకుంటూ లేనిపోని టెన్షన్ పడుతున్నారా...

గెలవాలని అందరికీ ఉంటుంది. గెలిచేది మాత్రం కొందరే. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, టీడీపీ, వైసీపీ రెండింటిలో ఏదో ఒక పార్టీ గెలిస్తే, మరో పార్టీకి ఓటమి తప్పదు. ఆ గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అన్నదే అంతుబట్టకపోవడంతో ఇటు టీడీపీ, అటు వైసీపీ... రెండు పార్టీల్లోనూ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ ఏ కొత్త విశ్లేషణ కనిపించినా వెంటనే దాన్ని తెలుసుకొని... అలా కూడా జరగొచ్చు... అది మనకు కలిసిరావచ్చు అని అనుకుంటూ ఊరట పొందుతున్నారు. ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా బెట్టింగ్స్ కాస్తున్నారు, వివిధ ఛానెళ్లలో ఏ పార్టీకి అనుకూలంగా వార్తలు వస్తున్నాయి. పత్రికలు ఏం చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రజలు ఎవరివైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వంటి లెక్కలన్నీ వేసుకుంటూ... మే 23 ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు నేతలు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ పైకి తామే అధికారంలోకి వస్తామని ఎవరికి వారు వంద శాతం నమ్మకంతో చెబుతున్నారే గానీ... లోలోపల మాత్రం ప్రజలు ఎవరి పక్షాన నిలిచారన్న టెన్షన్ వారికీ ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనంతటికీ కారణం ప్రజల నాడిని ఎవరూ పట్టుకోలేకపోవడమే.

సాధారణంగా ఓ పార్టీ గెలుపును కచ్చితంగా డిసైడ్ చేసే విషయంలో మహిళలు ముందుంటారు. వాళ్లు గనక తలచుకుంటే అధికార పార్టీని గద్దె దించగలరు, ప్రతిపక్షాన్ని గట్టెక్కించగలరు. ఒక్కోసారి వాళ్లే అధికార పార్టీకి తిరిగి పట్టం కట్టిన సందర్భాలూ ఉన్నాయి. మగాళ్లు ఎవరికి ఓటు వేసేదీ పైకి చెప్పేస్తుంటారు. అదో సీక్రెట్ లాగా పెద్దగా భావించరు. మహిళలు అలా కాదు. ఎవరికి ఓటు వేసేది చెప్పేందుకు వారు ఇష్టపడరు. అది తమ సీక్రెట్ అంశంగా వారు భావిస్తారు. అందువల్ల మీరు ఎవరికి ఓటు వేశారు అని ఏ సర్వే సంస్థ ప్రతినిధులైనా అడిగితే... నవ్వి ఊరుకుంటారే తప్ప కచ్చితంగా ఫలానా పార్టీకి వేశామని గబుక్కున చెప్పేయడానికి ఇష్టపడరు. ఇదే సర్వే సంస్థలకు సవాలైంది. ఇక్కడే రాజకీయ పార్టీలు ఇబ్బంది పడుతున్నాయి. పసుపు-కుంకుమ స్కీం వల్ల మహిళలు తమకే ఓటు వేశారని టీడీపీ అంటుంటే... అంతలేదు... నవరత్నాలు ఎంతో మేలు చేస్తాయన్న ఉద్దేశంతో మహిళలు తమకే ఓటు వేశారని వైసీపీ అంటోంది. లోగుట్టు ఆ వెంకటేశుడికే ఎరుక అందామా.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఎక్కువ నియోజకవర్గాలు ఈసారి వైసీపీ వశం అవుతాయని ఆ పార్టీ నేతలు బలంగా చెబుతున్నారు. ఇక రాయల సీమలో ఈసారి తమ బలం పుంజుకుందని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో ఇదివరకు పూర్తిగా టీడీపీతో ఉన్న ప్రజలు ఈసారి ఆ పార్టీకి కౌంటర్ ఇస్తూ... వైసీపీతో జట్టు కట్టబోతున్నారనీ అందువల్ల భారీ సీట్లతో తాము అధికారాన్ని చేపడతామని వైసీపీ నేతలు తమదైన లెక్కలు చెబుతున్నారు. ఇవన్నీ పైపై ఊహలేనంటున్న టీడీపీ... గోదావరి జిల్లాల్లో తమ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని చెబుతోంది.


నెల పాటూ టెన్షన్లను భరిస్తూ ఉండటం కంటే... ఒక్కో వ్యక్తీ ఎవరికి ఓటు వేసి ఉంటారో తెలుసుకుంటే... ఓ వారం, పది రోజుల్లో గెలుపు ఎవరిదో అర్థమైపోతుందని అంచనా కొస్తున్న టీడీపీ... పోలింగ్ కేంద్రాల స్థాయిలో మొత్తం ఓటర్ల జాబితాను తెప్పించుకొని... ఒక్కో ఓటరూ ఎవరికి వేసి ఉంటారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా కచ్చితమైన లెక్కతో ధీమాగా ఉండొచ్చని భావిస్తోంది. వైసీపీ హైకమాండ్ ఇలాంటివి చెయ్యకపోయినా, ఆల్రెడీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ (IPAC) కచ్చితమైన లెక్క ఇచ్చిందనీ, ఇక ఇతర లెక్కలు అవసరం లేదనీ జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఐతే వైసీపీ నేతలు మాత్రం టెన్షన్ భరించలేక... క్షేత్రస్థాయిలో వాస్తవాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వేల వంటివి చేయించకపోయినా... ఆ పార్టీ నేతలు మాత్రం... టీడీపీ అధికారంలోకి వస్తుందా, వైసీపీ వస్తుందా అన్న అంశంపై లెక్కలు వేస్తున్నట్లు తెలిసింది. తాము కింగ్ మేకర్లం అవుతామన్న నమ్మకంతో ఉన్న ఆ పార్టీ నేతలు... అవకాశం వస్తే, అధికారంలో భాగస్వామ్యం అయ్యి, 2024 నాటికి బలమైన పార్టీగా జనసేనను మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఐతే... అసలు జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి, ఆ పార్టీకి ఉత్తరాంధ్రలో పరిస్థితి ఎలా ఉంది. గోదావరి జిల్లాల్లో కాపు వర్గం ఓట్లేమైనా రాబట్టిందా, సీమలో సంగతేంటి అన్న అంశంపై క్లారిటీ లేదు. ఫలితాలు వస్తే తప్ప, వాస్తవాలు తెలియవని ఆ పార్టీ నేతలు రకరకాల ఆలోచనల్లో తలమునకలయ్యారు.

మే 19న ఎగ్జిట్ పోల్స్ వస్తాయనే ప్రచారం జరుగుతోంది. అవి రావాలన్నా మరో 25 రోజులు ఆగాల్సిందే. అప్పటివరకూ ఓపిక పట్టాల్సిందే. అదే ఎలా అనుకుంటూ టెన్షన్లతో గడుపుతున్నారు నేతలు.

 

ఇవి కూడా చదవండి :

చంద్రబాబుకి సింగపూర్... జగన్‌కు స్విట్జర్లాండ్... వైసీపీ అధినేత ప్లాన్ అదిరిందిగా...

కొత్తిమీర పుదీనా జ్యూస్... వేసవిలో తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...

సమ్మర్‌లో బీట్ రూట్ జ్యూస్ తాగుతున్నారా... ఈ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...
First published:

Tags: Chandrababu naidu, Janasena, Janasena party, Pawan kalyan, Tdp, Ycp, Ys jagan, Ys jagan mohan reddy, Ysrcp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు