TDP TO SERVE PRIVILEGE MOTION AGAINST CM YS JAGAN IN AP ASSEMBLY AK
AP Assembly Session: సీఎం జగన్‌పై ప్రివిలేజ్ మోషన్.. టీడీపీ కీలక నిర్ణయం
సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
AP Assembly Session: నిన్న సీఎం జగన్ శాసనసభ సమావేశాల్లో పెన్షన్లపై తప్పుడు సమాచారం ఇచ్చారని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి ప్రివిలేజ్ మోషన్ నోటీసు అందజేయనున్నట్లు ప్రకటించింది.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. 3వ తేదీ గురువారం జరిగిన శాసనసభ సమావేశాల్లో పెన్షన్లపై సీఎం జగన్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించింది. ఈ కారణంగా ఆయనపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనున్నామని టీడీపీ శాసనసభాపక్షం ప్రకటించింది. అక్టోబరు 2018 నాటికి గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల వివరాలపై తప్పుడు వివరాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించేందుకు సీఎం జగన్ ప్రయత్నించారని ఆరోపించింది. ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు టీడీపీ తెలిపింది. ఈ మేరకు స్పీకర్‌ను కలిసి ప్రివిలేజ్ మోషన్ నోటీసు అందజేయనున్నట్లు టీడీపీ ప్రకటించింది.
ఇదిలా ఉంటే ఐదో రోజు కూడా అసెంబ్లీలో నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం ముందుకు వెళ్లి నిరసన చేపట్టారు. వెనక్కి వెళ్లాలంటూ చెప్పినప్పటికీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించారు. దీంతో స్పీకర్ తమ్మినేని వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, మంతెన రామరాజును సస్పెండ్‌కు గురయ్యారు. మరోవైపు స్పీకర్ తీరుకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి బయటకు వచ్చేశారు. లాబీలో నినాదాలు చేస్తూ టీడీఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు.