తెలుగుదేశం పార్టీ చేపడుతున్న ధర్మ పోరాట దీక్షకు ఇవాళ అనంతపురం వేదిక కానుంది. పార్టీ అధ్వర్యంలో నేడు అనంతపురం నగరంలో 11వ ధర్మపోరాట దీక్ష చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దీక్షలో పాల్గొని ప్రసంగిస్తారు. దీక్ష కోసం నగరంలోని బళ్లారి రోడ్డులో విశాల మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు లక్షన్నర మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను తరలించేందుకు తెలుగు తమ్ముళ్లు కసరత్తు చేస్తున్నారు. ఈ దీక్షలో సీఎం చంద్రబాబుతో పాటు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, కొంతమంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పోరాటమా? బల నిరూపణా?
రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ తాము ఈ దీక్ష చేస్తున్నట్లు చెబుతున్న టీడీపీ ఒక రకంగా బల నిరూపణ కోసం కూడా ఇవాళ్టి దీక్షను వేదికగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు కేంద్రం వైఖరిని ఎండగట్టడంతోపాటూ... భారీగా జన సమీకరణ చేసి... ప్రత్యర్థి పార్టీలకు టెన్షన్ తెప్పించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లా నేతలు వీలైనంత ఎక్కువ మందిని వేదిక చెంతకు తరలించేందుకు వారం నుంచీ రకరకాలుగా ప్రయత్నించారు. జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 1,300 ప్రైవేటు, ఆర్టీసీ బస్సుల్లో 1.5 లక్షల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణతో పాటు శింగనమల, తాడిపత్రి, పుట్టపర్తి, పెనుకొండ, కదిరి ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు తమ్ముళ్ల మధ్య వైరుధ్యాలు:
అనంత టీడీపీలో వర్గపోరు రచ్చ రేపుతోంది. ఈమధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ప్రజా ప్రతినిధులపై మండిపడ్డారు. జిల్లాలో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అధికారం ఇచ్చిన కింది స్థాయి నాయకులు, కార్యకర్తల్ని, ప్రజల్ని పట్టించుకోవడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా విభేదాలు వీడకుండా ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తూ పార్టీ పటిష్టతను మరిచి, ప్రతిష్టను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని, ఇన్చార్జ్ మంత్రిగా మీరేం చేస్తున్నారని మంత్రి దేవినేనిపై సీఎం సీరియస్ అయ్యారు. పార్టీ ఎవరి సొత్తూ కాదని, పద్ధతి మార్చుకోక పోతే ఎవరిని ఎక్కడ ఉంచాలో అధినేతకు బాగా తెలుసని, ఇప్పటికే ఎవరెవరికి పార్టీ టికెట్లు ఇవ్వాలో తొలి జాబితా సిద్ధంగా ఉందని, అధినేత తీసుకునే నిర్ణయానికి తాను కూడా మినహాయింపు కాదని దేవినేని అన్నారు.
ఈ పరిస్థితుల్లో హిందూపురం, రాప్తాడు, తాడిపత్రి, ధర్మవరం, రాయదుర్గం, పెనుకొండ మినహా, అనంతపురం సహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను దాదాపు మార్పు చేసే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మడకశిర ఎమ్మెల్యే ఈరన్న ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో, అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైసీపీ నేత డాక్టర్ తిప్పేస్వామి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జిల్లాలో టీడీపీకి షాకింగ్ విషయమే.
పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర భూకుంభకోణం. పరిటాల సునీతమ్మ,ఇరు సోదరులు,మరిది, సూత్రదారులు.పేద రైతుల భూములు బలవంతపెట్టి ఎకరం 30 వేలు కంటే తక్కువకే కొన్నారు.కియా ప్రాంతంలో భూములన్నీ పరిటాల బినామీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ధర్మవరం ఎమ్మేల్యే సూరి కియా పుణ్యమా అని వందల కోట్లు ఆర్జన.
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 24, 2018
అనంతలో సీఎం షెడ్యూల్:
బళ్లారి రోడ్డులో విశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు సభ జరగబోతోంది. సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 12.15 గంటలకు అమరావతిలోని తన ఇంటి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అనంతపురంలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. తర్వాత రోడ్డు మార్గంలో బళ్లారి రోడ్డులోని ఎంవై ఆర్ ఫంక్షన్ హాలు పక్కన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు 2.15 గంటలకు చేరుకుంటారు. సుమారు రెండున్నర గంటల పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4.45 గంటలకు శిల్పారామం నుంచి హెలికాప్టర్లో పుట్టపర్తి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరిగి గన్నవరం చేరుకుంటారని పార్టీ వర్గాలు షెడ్యూల్ ఖరారు చేశాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp-tdp, Chandrababu naidu