ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ (MLC Ashoke Babu Arrest) వ్యవహారంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ (YSRCP) ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన అశోక్ బాబు.. ఏపీ ఎన్జీవో నేతగా వ్యవహరించారు. అనంతరం ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్సీ పదవి పొందారు. ఇదిలా ఉంటే సర్వీస్ సమయంలో పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణల నేపథ్యంలో అశోక్ బాబును గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబుపై 477 (A ), 466, 467, 468, 471,465,420, R/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఎపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu Naidu) మండిపడుతున్నారు. సర్వీస్ మేటర్స్ లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. అర్థరాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందని ప్రశ్నించారు.ఉద్యోగుల సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీసినందునే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్షగట్టిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లిస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. మరోవైపు ఎమ్మెల్సీ అశోక్ బాబు సతీమణితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో మాట్లాడారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని లోకేష్ ఆమెకు భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్టును టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పుల్ని పశ్నించిన టీడీపీ నేతల్ని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అచ్చెన్న ఆరోపించారు. గతంలో అశోక్ బాబుపై వచ్చిన ఆరోపణలపై ఆయన ప్రమేయం లేదని విచారణలో తేలినా కుట్రపూరితంగా మళ్లీ కేసు పెట్టడం దారుణమని ఆయన అన్నారు. అశోక్ బాబును వెంటనే విడుదల చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
ఇది చదవండి: ఆలీకి రాజ్యసభ బెర్త్ కన్ఫామ్..? గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..?
ఇదిలా ఉంటే గుంటూరు సీఐడీ కార్యాలయంలో అశోక్ బాబును కలిసేందుకు వెళ్లిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ, కోవెలమూడి రవీంద్ర, పిల్లి మాణిక్యరావుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు. అశోక్ బాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశముందని ఈ సందర్భంగా దేవినేని ఉమా అనుమానం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, TDP