నారా లోకేష్ హ్యాపీ... లగడపాటి సర్వేతో గెలుపుపై పెరిగిన ధీమా

ఎన్నికల ప్రచారంలో లోకేష్ (Image : Lokesh Nara/Twitter)

AP Assembly Election 2019 : మంగళగిరిలో లోకేష్‌కి భారీ మెజార్టీ వస్తుందని టీడీపీ రిపోర్ట్‌లో తేలడం, సైకిల్‌కే ప్రజలు ఓటు వేశారని లగడపాటి చెప్పడంతో... లోకేష్ గెలుపుపై టీడీపీలో ధీమా పెరిగింది.

  • Share this:
సాధారణంగా ఏదైనా పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తే... ఆ పార్టీలోని చాలా మంది కీలక నేతలు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ రూల్ తమకూ వర్తిస్తుంది అంటున్నారు టీడీపీ నేతలు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం... టీడీపీకి క్లియర్ మెజార్టీ వస్తే... టీడీపీలోని కీలక నేతలంతా తిరిగి విజయం సాధిస్తారనే దాని అర్థం అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఆ రకంగా చూస్తే... ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గుంటూరులోని మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచీ గెలవడం తథ్యమనే అంచనాకి వచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్‌తోపాటూ టీడీపీ నేతలంతా తిరిగి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఆలోచనలు మొదలుపెట్టేశారని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎమ్మెల్సీగా ఉన్న లోకేష్... ఎమ్మెల్యేగా గెలిచి... అసెంబ్లీలో అడుగుపెట్టి... కీలక మంత్రి పదవి పొంది... పార్టీలో అత్యంత కీలక నేతగా మారేందుకు నిన్నటి నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగినప్పటి నుంచే... లోకేష్ విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లోకేష్ ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యనివ్వకుండా... ఎన్నికల్లో బరిలో దింపారు చంద్రబాబు. ఇందుకు ప్రధాన కారణం లోకేష్ ఓడిపోతే, తిరిగి ఎమ్మెల్సీగా కొనసాగించాలనే ఉద్దేశంతోనే అంటున్నాయి ప్రతిపక్షాలు. లోకేష్ గెలుస్తారనీ, కాకపోతే కొద్దిపాటి మెజార్టీతో గెలుస్తారని ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 13న చంద్రబాబుకి సన్నిహిత వర్గాలు చెప్పినట్లు తెలిసింది. అప్పటి నుంచీ చంద్రబాబు... లోకేష్ గెలుపుపై ధీమాగా ఉన్నారు.

తాజాగా నియోజకవర్గాల వారీగా ఆయా అభ్యర్థుల నుంచీ రిపోర్టులు తెప్పించుకుంటున్న చంద్రబాబు... మంగళగిరిలో పరిస్థితి ఏంటన్నదానిపై లోకేష్ నుంచీ రిపోర్ట్ తెప్పించుకొని పరిశీలించారు. అందులో లోకేష్‌కి ప్రధాన ప్రత్యర్థి కంటే 30 శాతం ఎక్కువ ఓట్లు వస్తాయని ఉన్నట్లు తెలిసింది. దాంతో చంద్రబాబుతోపాటూ టీడీపీ వర్గాలు ఫుల్ ఖుషీ అయిపోయాయి. ఇప్పుడు లగడపాటి టీడీపీకి అనుకూలంగా కామెంట్లు చెయ్యడంతో... ధీమా మరింత పెరిగింది.

లోకేష్ గెలుపు సాధ్యమేనా? : టీడీపీ వర్గాలు ఇంత పాజిటివ్‌గా ఉన్నా, మంగళగిరిలో లోకేష్ గెలుపు అంత తేలిక కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మంగళగిరిలో 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరోసారి బరిలో దిగి లోకేష్‌కు గట్టిపోటీ ఇచ్చారు. స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే స్పందిస్తారనే సానుకూల అంశాలున్నాయి. ఐతే అదే మంగళగిరిలో టీడీపీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా ఐటీ సంస్థలకు అక్కడ ప్రత్యేక వెసులుబాట్లు కల్పించింది. అదీ కాక మంగళగిరి... రాజధాని అమరావతిలో భాగంగా ఉంటోంది. దాంతోపాటూ... సీఎం చంద్రబాబు కొడుకైనందున టీడీపీ అధికారంలోకి వస్తే, లోకేష్ వల్ల మంగళగిరి ఎక్కువ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో తటస్థ ఓటర్లు టీడీపీకి ఓటు వేస్తారని భావించి... ఆ స్థానంలో లోకేష్‌ని దింపారని తెలుస్తోంది. పైగా లోకేష్ అసమర్థుడనీ, దమ్ముంటే ఎమ్మెల్యేగా గెలిచి, అప్పుడు మంత్రి పదవి చేపట్టాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు. ఆ సవాల్‌ని స్వీకరించిన లోకేష్... కచ్చితంగా గెలవబోతున్నారనే సంకేతాలొస్తున్నాయని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.

 

ఇవి కూడా చదవండి :

లగడపాటి సర్వే... లాజిక్ మిస్సైందా... టీడీపీ, వైసీపీకి తగ్గితే... జనసేనకు పెరగలేదేం..?

ఏపీ... చంద్రగిరి : ఏడు కేంద్రాల్లో రీపోలింగ్... భారీ భద్రతా ఏర్పాట్లు...

నేడు ఏడో దశ పోలింగ్... బరిలో ఉన్న ప్రముఖులు వీరే...

ఎవరు గెలుస్తారు..? కోట్లు సంపాదిస్తున్న జ్యోతిష్యులు...
First published: