నా బిడ్డను కాపాడుకోడానికే వచ్చా -టీడీపీ నేత పట్టాభి సంచలన వీడియో -పార్టీ ఎందుకలా చేసింది?

ఎయిర్ పోర్టులో టీడీపీ నేత పట్టాభి

ఆ సమయంలో ఎనిమిదేళ్ల నా ఒక్కగానొక్క కూతురిని భయపెట్టారు. ఇది అమానవీయ చర్య. పసిపిల్లల హృదయాలను గాయపడితే వాటిని రూపుమాపడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. వైసీపీ శ్రేణుల దాడితో నా కూతురు షాక్ కు గురైంది. అలాంటి పరిస్థితిలో..

  • Share this:
ఆంధ్రప్రదేశ్ లో పెను దుమారం రేపిన ‘బోషిడికే’ వివాదంతో ప్రధాన ముద్దాయి, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అలియాస్ పట్టాభి కొద్ది సేపటి కిందటే సంచలన వీడియో ఒకటి విడుదల చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను దూషించిన కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత నుంచి ఎవరికీ కనిపించకుండా పోయిన పట్టాభి.. సడెన్ గా ఇవాళ టీడీపీ అధికారిక ఖాతాల్లో.. అది కూడా మార్ఫింగ్ ను తలపించే వీడియోలో ప్రత్యక్షమయ్యారు. పట్టాభికి ప్రాణహాని ఉందంటూ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే హెచ్చరించిన కాసేపటికే టీడీపీ పట్టాభి తాజా వీడియోను విడుదల చేయడం గమనార్హం. పట్టాభి తన ఫ్యామిలో కలిసి మాల్దీవులకు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతుండగా, తాను ఎక్కడికి వెళ్లానో చెప్పకుండానే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. వైసీపీ శ్రేణుల దాడితో షాక్ కు గురైన తన కూతురిని కాపాడుకోడానికే ఏపీ నుంచి దూరంగా వచ్చేశానని పట్టాభి చెప్పారు..

‘గత కొద్ది రోజులుగా మాదకద్రవ్యాలకు వతిరేకంగా, గంజాయి అక్రమ రవాణాకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తోన్న ఉద్యమంలో నేను క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను. అయితే, నాపై కుట్రపూరితంగా అవరోధాలు సృష్టించారు. కష్టకాలంలో అండగా నిలిచిన పార్టీ పెద్దలు, మిత్రులు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోడానికే టీడీపీ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించింది. కానీ నేను మాట్లాడిన వాటిలోకొన్ని మాటలకు లేని అర్థాలను సృష్టించారు. గడిచిన రెండున్నరేళ్లుగా నేను అనేక అంశాలపై ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాను. నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే.. అధికార పార్టీ నాపై దాడికి పాల్పడింది.

టీడీపీ నేత పట్టాభి హత్యకు కుట్ర? -కాపాడుకోమంటూ ఫ్యామిలీకి వార్నింగ్ -వైసీపీ ఎమ్మెల్యే చెప్పేది నిజమేనా?


నేను ఇంట్లో లేని సమయంలో కుటుంబంపై దాడి చేసి, ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఎనిమిదేళ్ల నా ఒక్కగానొక్క కూతురిని భయపెట్టారు. ఇది అమానవీయ చర్య. పసిపిల్లల హృదయాలను గాయపడితే వాటిని రూపుమాపడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. వైసీపీ శ్రేణుల దాడితో నా కూతురు షాక్ కు గురైంది. అలాంటి పరిస్థితిలో బాధ్యతగల తండ్రిగా నా కూతురుని తీసుకొని కొద్ది రోజులపాటు బయటికి వచ్చాను. పాపను తీసుకుని ఇలా రావడంపైనా వైసీపీ వాళ్లు విపరీత అర్థరాలు తీస్తున్నారు.ఈ వీడియో మెసేజ్ ద్వారా ఒకటే చెప్పాలనుకున్నా.. బిడ్డ కోసం ఒక తండ్రిగా బాధ్యత నిరవేరుస్తున్నా.. గాయపడిన ఒక పసి హృదయాన్ని కాపాడుకోవడం కోసం.. ఆ గాయాన్ని రూపుమాపడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. దాని మీద కూడా విమర్శలు చేయడం బాధాకరం. తండ్రిగా నా బాధ్యత పూర్తయిన వెంటనే తిరిగి క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటాను. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలోకి మళ్లీ వస్తాను. కుట్రపూరితమైన కేసులకు భయపడను. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొస్తాం..’అని పట్టాభి ముగించారు. టెక్నాలజీని వాడటంలో మంచి పేరున్న టీడీపీ.. పట్టాభి వీడియోను నేరుగా కాకుండా, పార్టీ ఆఫీసులో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా మార్ఫింగ్ ఎందుకు చేసిందనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి..
Published by:Madhu Kota
First published: