Lokesh On YCP: తాలిబ‌న్ల తాత‌ల్లా వైసీపీబన్లు.. సారా నుంచి నాటు తుపాకీల తయారీకి ఎదిగారు అంటూ లోకేష్ ఫైర్

Nara Lokesh

Nara Lokesh: ఆఫ్గనిస్థాన్ లో తాలిబన్ల కంటే.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీబన్లు ప్రమాదకరంగా తయ్యారయ్యారని లోకేష్ మండిపడ్డారు. సీఎం జగన్ ఏరీ కోరి నియమించుకున్న వాలంటీర్లు సారా నుంచి నాటు తుపాకీలు తయారు చేసే స్థాయికి ఎదిగారంటూ ఆవేదన వ్యక్తం చేశారు...

 • Share this:
  Nara LOkesh On CM Jagan: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) రెండు రోజుల పాటు పోలవరం (Polavaram) ముంపు గ్రామాల్లో పర్యటించి అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. పోలవారం ముంపు గ్రామాలను ఏపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. నిర్వాసితులు ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమే అన్నారు. పునరావాస కాలనీల నిర్మాణాలకు, పరిహారాలకు డబ్బు లేదంటున్న వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy).. అదే ప్రాజెక్టు దగ్గర పెట్టేందుకు 200 కోట్ల రూపాయలతో తన తండ్రి విగ్రహాన్ని ఎలా తయారు చేయిస్తున్నారని ప్రశ్నించారు. లక్షా 90 వేల మంది త్యాగమే పోలవరమని.. టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తి చేస్తే.. రెండున్నరేళ్ల జగన్‌ పాలనలో కేవలం నాలుగు శాతమే చేశారన్నారు. టీడీపీ ఐదేళ్లలో 11,531 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలో 850 కోట్లు మాత్రమే వెచ్చించారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరాకు 19 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసి.. పాదయాత్రలో తొమ్మిది లక్షలకు తగ్గించి పది లక్షలకు దిగజారారన్నారు.

  తరువాత ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. తాలిబ‌న్ల తాత‌ల్లా త‌యార‌య్యారు వైసీపీబ‌న్లు అని నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ఓపీయం (న‌ల్లమందు) ఒక్కటే పండిస్తారని.. వైసీపీబ‌న్ల పాలనలో వాలంటీర్లు సారా త‌యారీ నుంచి మొద‌లై నేడు నాటు తుపాకుల త‌యారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు నెల‌కొల్పిన‌ మెడ్‌టెక్‌ జోన్‌లో క‌రోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే.. జ‌గ‌న్ విధ్వంస‌క పాల‌న‌లో ఫ్యాక్షన్‌ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రా అయ్యాయని వ్యాఖ్యానించారు.  ఇంత కాలం దిశ చట్టాన్ని సీఎం జగన్ రాజకీయ లబ్ది కోసం వాడుకున్నారని, మహిళల్ని మోసం చేసారని స్వయంగా హోంమంత్రి సుచరిత ఆంగీకరించారని.. కానీ హోంమంత్రి హక్కులు హరించిన షాడో హోంమంత్రి ఆమెను ఇంటికే పరిమితం చెయ్యడంతో నిజాలు బయటపెట్టడం అభినందనీయమంటూ సెటైరు వేశారు.  దిశ చట్టం లేదని హోం మంత్రి ఒప్పుకున్నారని.. మరి మహిళలకు భద్రత ఎలా అని లోకేష్ ప్రశ్నించారు. సీఎం చెప్పిన 21 రోజుల్లో ఇక 6 పనిదినాలు మాత్రమే మిగిలాయి. రమ్యని కిరాతకంగా చంపిన వాడికి ఉరేసి కనీసం చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని పని చేస్తున్నారని నిరూపించండి అంటూ కోరారు.  గతంతో పోల్చుకుంటే.. నారా లోకేష్ రూటు మార్చారు. విమర్శల దాడి పెంచారు. సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూనే.. ప్రజా వ్యతిరేకతపై ప్రత్యక్ష పోరాటాలు చేస్తున్నారు. నిరసనల పేరుతో ప్రజల్లోనూ ఉంటున్నారు..
  Published by:Nagesh Paina
  First published: