ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు (Cinema Industry) మధ్య ఇటీవల కాలంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నేతృత్వంలో సినీ ప్రముఖులు సీఎం జగన్ (CM YS Jagan) తో భేటీ అయి సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని సీఎం హామీ ఇవ్వగా.. ఆ తర్వాత అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఐతే సమావేశం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎం జగన్ ను చేతులు జోడించి అడగడంపై రకరకాల చర్చలు జరిగాయి. ప్రతిపక్ష టీడీపీ మాత్రం వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను బెదిరిస్తోందని.. కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించింది. అంతేకాదు చిరంజీవి లాంటి వ్యక్తిని అవమానించారంటూ మండిపడింది.
తాజాగా భీమ్లా నాయక్ రిలీజ్ కు ముందు సినిమా టికెట్ల ధరలు సవరించకపోవడం, అదనపు షోలకు అనమతివ్వకపోవడంతో టాలీవుడ్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఇదే విధంగా ఏపీ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతుందని జేసీ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ తీరు వల్ల సినీ పరిశ్రమకు మనుగడ లేకుండా పోయిందని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. అలాంటి చర్యల వల్ల సినీ నటులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఆయన.. అధికారులంతా సినిమా థియేటర్ల మీద పడితే అక్కడ పనిచేసే కార్మికులు, చిన్నచిన్న వ్యాపారులు నష్టపోతారని చెప్పారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీవ్ ఈవెంట్ కు కేటీఆర్ రావడంతో పవన్ కల్యాణ్ కి ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ప్రతి మనిషికి ఈగో ఉంటుందని.. కష్టపడి పైకి వచ్చిన పవన్ కల్యాణ్ లాంటి వారికి ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు.
పవన్ పై కక్ష సాధించడం ద్వారా జగన్ సాధించేదేంటో చెప్పాలన్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏ సినిమా తీసినా ఆయన రెమ్యూనిరేషన్ అయనకు వస్తుందన్నారు. వీలుంటే మంచి పనులు చేసి ప్రజల ముందు మెప్పు పొందాలి గానీ.. కక్ష సాధింపు వల్ల వచ్చేదమీ లేదన్నారు. చిరంజీవి లాంటి వ్యక్తి జగన్ ఎదుట చేతులు జోడిస్తే ఏడుపొచ్చిందన్నారు. చాలా కింది స్థాయి నుంచి స్వయం కృషితో పైకొచ్చిన చిరంజీవి.. చేతులు జోడించి అడిగారని.. ఆ పరిస్థితి ఎవరికీ రావొద్దన్నారు. చిరంజీవి అలా అడిగారంటే అది ఆయన కోసం కాదని.. ఇండస్ట్రీ కోసమే అడిగారని జేసీ అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.