కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడ (Gudivada) క్యాసినో వివాదం ఏపీ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. ఈ వ్యవహారంపై ఇటు వైసీపీ (YSRCP).. అటు టీడీపీ (TDP) ఎవరూ తగ్గడం లేదు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటనతో గుడివాడ రణరంగంగా మారింది. అందుకు తగ్గట్లుగా మంత్రి కొడాలి నాని కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం వాతావరణాన్ని మరింత హీటెక్కింది. క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా పెట్రోల్ పోసుకొని చస్తానంటూ మంత్రి కొడాలి నాని సవాల్ చేశారు. దీనిపై టీడీపీ కూడా ఘాటుగా స్పందించింది. కొడాలి నాని ఏ తప్పూ చేయకుంటే టీటీడీ నిజనిర్ధారణ కమిటీని ఏందుకు అడ్డుకున్నారో సమాధనం చెప్పాలంటూ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ప్రశ్నించారు.
కొడాలి నాని అడ్డంగా దొరికిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మంత్రి సవాల్ ను స్వీకరిస్తున్నామని బొండా ఉమా ప్రకటించారు. క్యాసినో జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్న బొండా ఉమా.. ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్తే పెట్రోల్ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం అంటూ ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు క్యాసినోలో డ్యాన్సులు వేసిన వారి పేర్లు, వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. కరోనా వచ్చిందని హైదరాబాద్ లో ఉన్నామంటే చేసిన తప్పులు పోతాయా..? అని బొండా ఉమా ప్రశ్నించారు. అమ్మాయిలో అర్ధనగ్న డాన్సులు వేయిస్తుంటే తానే పోలీసులతో ఆపించానని మంత్రి చెప్పడమే క్యాసినో జరిగిందనడానికి నిదర్శనమని ఆయన అన్నారు.
కాగా గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్లో సంక్రాంతి పండుగ సందర్భంగా క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై టీడీపీ నేతలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు ఫిర్యాదు చేయగా నూజివీడు డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు శుక్రవారం గుడివాడకు వెళ్లిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓ దశలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు నిజనిర్ధారణ కమిటీ సభ్యులను అరెస్ట్ చేశారు. 10 మంది వస్తామని చెప్పి వందల మంది రావడంతో టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై కేబినెట్ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన కొడాలి నాని.. క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడమే కాకుండా.. పెట్రోల్ పొసుకోని ఆత్మహత్య చేసుకుంటానని.. టీడీపీ నేతలేం చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. అంతేకాదు చంద్రబాబకు చెందిన హెరిటేజ్ సంస్థలో వ్యభిచారం జరుగుందంటే ఊరుకుంటారా..? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bonda uma, Kodali Nani, TDP