నర్సీపట్నంలో అయ్యన్న ఇంటి గోడ కూల్చుతోన్న బుల్డోజర్
యూపీ తరహాలో ఏపీలోనూ బుల్డోజర్ దూకుడు ప్రదర్శించింది. ప్రతిపక్ష టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను అధికారులు బుల్డోజర్ తో కూల్చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది..
యూపీ బీజేపీ సీఎం యోగి ఫార్ములానే ఏపీ వైసీపీ సీఎం జగన్ ఫాలో అవుతున్నారా? చట్టవ్యతిరేకులు, సంఘవిద్రోహులు, అల్లర్లలో పాలుపంచుకున్నవారి ఇళ్లపై బీజేపీ పాలకులు పంపిన తరహాలోనే ఏపీలోనూ దృశ్యాలు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోనూ బుల్డోజర్ (Bulldozer)దూకుడు ప్రదర్శించింది. ప్రతిపక్ష టీడీపీ (TDP)కి చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఇంటి గోడను అధికారులు బుల్డోజర్ తో కూల్చేశారు.
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచి తీవ్ర ఉద్రిక్తత, భారీ ఎత్తున పోలీసు బలగాల మోహరింపు కొనసాగుతున్నది. అయ్యన్నపై నిర్భయ చట్టంతోపాటు మరో 12 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చని సమాచారం. వివరాలివే..
ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. నర్సీపట్నంలో అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్పై, మంత్రి ఆర్కే రోజాపై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫలితంగానే తాజా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
అనుచిత వ్యాఖ్యలతోపాటు స్థలం ఆక్రమణ వ్యవహారంలోనూ అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. అయ్యన్న ఇంటి వెనకాల గోడను బుల్డోజర్ (జేసీబీ)తో కూల్చివేశారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని.. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గోడ కూల్చివేతపై అయ్యన్న కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారమే ఇంటి గోడ ఉందని, దానిని అక్రమమంటూ కూల్చేయడం అన్యాయమని అయ్యన్న కొడుకు రాజేశ్ మీడియాతో అన్నారు.
ల్యాండ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతే గోడను నిర్మించామన్న అయ్యన్న కుటుంబీకులు.. పోలీసులు ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అయితే, అధికారులు మాత్రం గోడను ప్రభుత్వ స్థలంలో నిర్మించినందుకే కూల్చేసినట్టు చెబుతున్నారు. అయ్యన్నఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయన కుమారుడు రాజేశ్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వివాదం జరిగి స్వల్ప తోపులాట కూడా చోటుచేసుకుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.