చంద్రబాబు మాటలతో హర్ట్ అయ్యా.. టీడీపీకి తోట త్రిమూర్తులు గుడ్ బై..

Thota Trimurthulu | తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈనెల 18న ఆయన వైసీపీలో చేరనున్నారు.

news18-telugu
Updated: September 13, 2019, 4:58 PM IST
చంద్రబాబు మాటలతో హర్ట్ అయ్యా.. టీడీపీకి తోట త్రిమూర్తులు గుడ్ బై..
తోట త్రిమూర్తులు (File)
  • Share this:
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. తాను పార్టీ మారినా టీడీపీకి వచ్చిన నష్టం లేదన్న చంద్రబాబునాయుడు వ్యాఖ్యల వల్ల మనస్తాపం చెందానని, అందుకే తాను టీడీపీకి గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్టు తెలిపారు. ఈనెల 18న ఆయన వైసీపీలో చేరనున్నారు. తోట త్రిమూర్తులుకు వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తోట త్రిమూర్తులు రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన శ్రీనివాస్ చేతిలో 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. గతంలో టీడీపీలోని కాపు నేతలతో కలసి కాకినాడలో ఓ రహస్య సమావేశం కూడా నిర్వహించారు. తాజాగా చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాపై సమీక్షించిన సమయంలో త్రిమూర్తులు ఆ సమావేశానికి హాజరుకాలేదు. త్రిమూర్తులను బుజ్జగించేందుకు టీడీపీ పెద్దలు చేసిన రాయబారం కూడా విఫలమైంది. దీంతో తోట త్రిమూర్తులు వెళ్లినా పార్టీకి నష్టం లేదనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేసినట్టు ఆయన దృష్టికి వచ్చింది. దీనిపై నొచ్చుకున్న త్రిమూర్తులు టీడీపీకి గుడ్ బై కొట్టి వైసీపీకి జై కొడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఏపీలోని కాపు సామాజికవర్గంలో తోట త్రిమూర్తులకు మంచి పట్టుంది. ఎన్నికలకు ముందే తోట త్రిమూర్తులును వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఆమంచి కృష్ణమోహన్ చర్చలు జరిపారు. తోట త్రిమూర్తులు 1994లో తొలిసారి ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో టీడీపీ నుంచి గెలిచారు. 2004 (టీడీపీ), 2009 (ప్రజారాజ్యం) లో పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో వైపీపీ అభ్యర్థి చేతిలో మరోసారి ఓటమిపాలయ్యారు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు