గతంలో అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించిన జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సంయమనం కోల్పోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కండితటి పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఓ దగ్గర పోలీసులు వాహనాలతో వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పడంతో తీవ్ర అగ్రహంతో ఊగిపోయారు. ఆయనకు సర్దిచెప్పేందుకు అక్కడే ఉన్న ఆయన అనుచరుడు, టీడీపీ నేత రఘు ప్రయత్నించారు. అయితే అప్పటికే కోపంతో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నేత రఘుపై చేయి చేసుకున్నారు. రెండు మూడు సార్లు చెంపదెబ్బలు కొట్టారు. బూతులతో రెచ్చిపోయారు. అయితే రఘు మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డికి ఏ మాత్రం ఎదురుచెప్పలేదు. అయితే కాసేపటికే తేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి.. రఘుకు క్షమాపణలు చెప్పారు.
ఇక కొన్ని నెలలుగా హాట్ హాట్‌గా సాగుతున్న అనంతపురం తాడిపత్రి రాజకీయాలు.. మున్సిపల్ ఎన్నికల కారణంగా మరింత వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. 24వ వార్డు నుంచి టీడీపీ తరపున కౌన్సెలర్‌గా పోటీ చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని.. తాము గెలిస్తే మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు.
మరోవైపు తాడిపత్రి మున్సిపాలిటీని ఎలాగైనా తమ సొంతం చేసుకోవాలని అధికార వైసీపీ కూడా అంతే పట్టుదలగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే, జేసీ కుటుంబంతో ఢీ అంటే ఢీ అంటున్న పెద్దారెడ్డి.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి వ్యూహరచన చేస్తున్నారు. ఇక్కడ గెలుపు ఇటు వైసీపీకి, అటు జేసీ బ్రదర్స్‌కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారడంతో.. ఎన్నికల నాటికి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో అనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Jc prabhakar reddy, TDP