Home /News /andhra-pradesh /

TDP CHIEF CHANDRABABU PLAYING DOUBLE STRATEGY FOR LOKESH IN AP ASSEMBLY ELECTIONS NK

గెలిస్తే ఎమ్మెల్యే... ఓడితే ఎమ్మెల్సీ... అందుకే నారా లోకేష్ పదవికి రాజీనామా చెయ్యలేదా?

నారా లోకేష్ (File)

నారా లోకేష్ (File)

AP Assembly Elections 2019 : మంగళగిరి నియోజకవర్గంలో గెలుస్తానన్న ధీమా లోకేష్‌లో లేదా? కొడుకు గెలుపుపై చంద్రబాబు సందేహిస్తున్నారా?

(సయ్యద్ అహ్మద్ - కరెస్పాండెంట్ - న్యూస్18)
మంగళగిరి నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు లోకేష్... ఎమ్మెల్సీ పదవిని వదులుకోకపోవడం వెనుక గల కారణాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పిస్తున్నామన్న కారణంతో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన రామసుబ్బారెడ్డితో రాజీనామాలు చేయించిన టీడీపీ... లోకేష్ విషయంలో ఆ ఫార్ములా అమలు చేయకపోవడానికి కారణం గెలుపుపై అనుమానాలేనా ? 2014 ఎన్నికల తర్వాత తన కుమారుడు నారా లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు... నాలుగేళ్లుగా మంత్రిగా కొనసాగించారు. ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉప ఎన్నికలకు అవకాశం వచ్చినా ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపేందుకు ఇష్టపడలేదు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఏపీలోని కుప్పం, హిందూపూర్, పెదకూరపాడు, భీమిలిని పోటీకి పరిశీలించిన లోకేష్... చివరికి రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న మంగళగిరి నుంచి బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆయన చురుగ్గా ఎన్నికల ప్రచారం కూడా చేసుకుంటున్నారు.

అంతవరకూ బాగానే ఉన్నా... టీడీపీ ఈసారి ఎమ్మెల్సీల విషయంలో అనుసరించిన ఫార్ములా లోకేష్‌కు ఎందుకు వర్తింపజేయలేదన్న విషయంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. లోకేష్‌కు మంగళగిరి సీటు ఖాయం చేయకముందే... అప్పటికే ఆయన కేబినెట్ సహచరుడిగా ఉన్న సోమిరెడ్డితో రాజీనామా చేయించారు. అలాగే కడప జిల్లా జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డితోనూ రాజీనామా చేయించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నందున నైతికంగా ఆలోచించి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వాళ్లిద్దరూ ప్రకటించారు. అయితే ఇదే కోవలో మంత్రి లోకేష్‌తో మాత్రం ఎందుకు రాజీనామా చేయించలేదనే చర్చ మొదలైంది.

తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న లోకేష్‌కు పూర్తిస్థాయిలో సేఫ్ నియోజకవర్గం ఏదీ లేదనే చెప్పవచ్చు. గతంలో చంద్రబాబు పోటీ చేసిన కుప్పంతో పాటు హిందూపూర్ వంటి స్థానాలు టీడీపికి కంచుకోటలు. ఈ రెండు స్థానాల్లో చంద్రబాబు, బాలకృష్ణ పోటీ తప్పనిసరి అని టీడీపీ భావిస్తోంది. అందుకే మరో స్థానం కోసం వెతికి చివరికి మంగళగిరి కేటాయించారు. ఇక్కడ సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల జనాభా అధికంగా ఉంది. తాజాగా ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఈ రెండు సమీకరణాల్నీ దృష్టిలో పెట్టుకుని లోకేష్‌ను మంగళగిరి నుంచీ బరిలోకి దింపారు.


మారిన పరిస్థితుల్లో బీసీ అభ్యర్ధిని కాదని లోకేష్‌కు చోటివ్వడంపై మంగళగిరిలో సదరు సామాజికవర్గం గుర్రుగా ఉంది. అలాగే ఐటీ కంపెనీల రాక ప్రారంభమైనా వాటిలో ఉద్యోగాలు కల్పించే స్థాయి ఇంకా రాలేదు. దీంతో ఈ రెండు సమీకరణాలూ లోకేష్‌కు కచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పలేని పరిస్ధితి. దీంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతోనే మంగళగిరిలో ఓడినా భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని లోకేష్‌కు ఎమ్మెల్సీ పదవి కొనసాగించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ సర్కారు ఏర్పడకపోతే మరోసారి లోకేష్‌ను పెద్దల సభకు పంపడం కూడా కష్టమేనన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.

 

ఇవి కూడా చదవండి :

రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న పవన్.. ఎక్కడి నుంచి బరిలో దిగుతారు?

ఇక రైళ్ల ఆలస్యాలు ఉండవ్... 250 స్టేషన్ల దగ్గర త్వరలో రైల్వే ఫ్లై ఓవర్లు

టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఖరారు... ఐదుగురు సిట్టింగ్‌లపై వేటు
First published:

Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Nara Lokesh

తదుపరి వార్తలు