TDP CHIEF CHANDRABABU NAIDU ON AP NEWS DISTRICTS HE WELCOME JAGAN DECISION FOR NTR DISTRCT BUS KEY SUGGESTIONS NGS
Chandra Babu: సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. అలా చేసి ఉండకూడదంటూ చంద్రబాబు సలహాలు
చంద్రబాబుపై జగన్
Chandra Babu on New Districts: ఏపీ సీఎం జగన్ సీఎం అయిన తరువాత తొలి సారి ఆయన నిర్ణయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు స్వాగతించారు.. ఆ ఒక్క విషయం సరే కానీ.. అంటూ చురకలు అంటించారు.. జగన్ ది అంతా కపట ప్రేమ అంటూ మండిపడ్డారు.
Chandra Babu on New Districts: ప్రస్తుతం 13 జిల్లాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇక 26 జిల్లాలుగా మారుతోంది. ఒక్కో లోక్ సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చారు. దీంతో ఏపీలో ఉన్న 25 లోక్ సభ సెంగ్మెంట్లు.. ఇప్పుడు జిల్లాలుగా మారాయి. అయితే అరుకును రెండు జిల్లాలుగా చేయడంతో ప్రస్తుతం జిల్లాల సంఖ్య 26కు చేరనుంది. అయితే ఈ జిల్లాలపై అక్కడక్కడ నిరసనలు తప్పు.. పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు.. మెజార్టీ జిల్లాల్లో అంతా పరిస్థితి సాధారణంగా ఉంది. నాలుగైదు జిల్లాల విషయంలో మాత్రం కాస్త ఆందోళనలు కనిపిస్తున్నాయి. విపక్ష పార్టీల విషయానికి వస్తే బీజేపీ పూర్తిగా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఈ విషయంలో చాలా ఆలస్యంగా స్పందించింది. అయితే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంతోనే.. ఎలా స్పందించాలనే విషయంలో తర్జనబర్జన తరువాతే లేటుగా స్పందించినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ 26 జిల్లాల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ సీనియర్ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు చంద్రబాబుకు 26 కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీలోనే కొత్త జిల్లాలు నిర్ణయంపై వ్యతిరేకత వస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే సీఎం జగన్ పలు తొందరపాటు నిర్ణయాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు అశాస్త్రీయంగా చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి నెలకొందని ఆయన విమర్శించారు. కనీసం కేబినెట్లో కూడా సమగ్రంగా చర్చించకుండా రాత్రికిరాత్రి నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు.
21వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎలాంటి చర్చ జరగలేదని చంద్రబాబు అన్నారు. 25వ తేదీ రాత్రికి రాత్రే మంత్రులకు నోట్ పంపి ఆమోదం పొందాల్సిన అత్యవసర పరిస్థితి ఏం వచ్చిందని ఆయన అన్నారు. రాజధాని తరలింపు, జిల్లాల ఏర్పాటు వంటి కీలక అంశాల పైన రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడలో క్యాసినో వ్యవహారాన్ని వదిలేది లేదు పోరాటం కొనసాగిస్తామని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ప్రజా సమస్యలతో పాటు ఉద్యోగుల ఆందోళన, పీఆర్సీ అంశాలను పక్కదారి పట్టించేందుకే తెరపైకి జిల్లాల విభజన అంశం తీసుకువచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. జనగణన పూర్తయ్యే వరకు జిల్లాల విభజన చేపట్టకూడదని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఏకపక్షంగా జిల్లాల విభజన చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షల మేరకు జిల్లాల విభజన ప్రక్రియ ఉండాలని, సమస్యలు తలెత్తేలా నిర్ణయాలు ఉండకూడదని చంద్రబాబు సూచించారు. అయితే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే ఎందుకు వ్యతిరేకిస్తామని, ఎన్టీఆర్ ను ఎవరు గౌరవించినా స్వాగతిస్తామన్నారు. అందుకే ఆ విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఎన్టీఆర్ కేవలం ఒక ప్రాంతానికి చెందిన నేత కాదని.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందన్నారు.
హైదరాబాద్ లో ఎయిర్ పోర్టుకు నాడు ఎన్టీఆర్ పేరును వైఎస్ఆర్ తొలగించారని, వైఎస్ పేరు కడప జిల్లాకు పెట్టినప్పుడు వ్యతిరేకించలేదన్నారు. టీడీపీకి ద్వంద్వ విధానాలు ఉండవని.. రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తూ.. అమరావతిలో ఎన్టీఆర్ స్మృతి వనం ప్రాజెక్టును నిలిపి వేయడం దారుణమన్నారు. ఎన్టీఆరుపై తమకు ప్రేమ ఉందని వైసీపీ చెప్పే ప్రయత్నాన్ని ప్రజలు నమ్మరన్నారు. చివరికి ఎన్టీఆర్ పేరున ఉన్న అన్నా క్యాంటీలను కూడా జగన్ నిలిపివేయడం నిజం కాదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.