ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతోంది. కీలక నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా వైసీపీ ముఖ్యనేతలు, మంత్రులపై పోటీ చేసేవారిని ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర వైపు నుంచి జిల్లాల వారీగా పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ నేతలకు దిశానిదేశం చేస్తున్న చంద్రబాబు.. అభ్యర్థుల విషయంలోనూ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఆయన్ను ఢీ కొట్టేందుకు అభ్యర్థిని ఎంపిక చేశారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవిని ఎంపిక చేశారు. ఇటీవల కడప జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించిన ఆయన.. అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులపై చర్చించారు.
ఈ సమావేశంలో పులివెందుల అభ్యర్థిపై చర్చ జరిగింది. కడప జిల్లాలో టీడీపీకి కీలక నేతగా వ్యవహరిస్తున్న బీటెక్ రవిని పులివెందుల బరిలో నిలపాలని చంద్రబాబు నిర్ణయించారు. పులివెందుల అభ్యర్థి విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని.. పార్టీని వదిలి వెళ్లిన వారు తిరిగి వచ్చినా బీటెక్ రవే.. సీఎం జగన్ పై పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి.. తిరిగి సైకిల్ ఎక్కుతారన్న ప్రచారం నేపథ్యంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.
పులివెందుల నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట. 1978 నుంచి ఇక్కడ వైఎస్ కుటుంబమే గెలుస్తూ వస్తోంది. వైఎస్ రాజెశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్పీ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు పులివెందుల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక 2004 అసెంబ్లీ ఎన్నికల నుంచి టీడీపీ తరపున సతీష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2011 ఉపఎన్నికల్లో తప్ప ఎన్నిసార్లు సతీష్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014 ప్రస్తుత సీఎం జగన్ పై పోటీ చేసిన సతీష్ కుమార్ రెడ్డి.. 75వేల ఓట్ల తేడాతో ఓడిపోయార. 2019లో 90వేల ఓట్లతేడాతో పరాజయం పాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన పార్టీ మారారు. దీంతో చంద్రబాబు బీటెక్ రవి వైపు మొగ్గుచూపారు.
2017లో జరిగిన కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిపై పోటీ చేసిన బీటెక్ రవి విజయం సాధించారు. అప్పటి నుంచి టీడీపీలో మరింత యాక్టివ్ అయ్యారు. ఐతే నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో ఏకంగా సీఎం జగన్ పై పోటీ చేయాలని భావిస్తున్న బీటెక్ రవి.. ఎంతమేరకు ప్రభావం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Pulivendula