Chandrababu Naidu: టీడీపీలోని ఆ కమిటీని పట్టించుకోని శ్రేణులు.. చంద్రబాబును పక్కదారి పట్టిస్తున్నారా ?

ప్రతీకాత్మక చిత్రం

TDP: పార్టీ కింది స్థాయిలో ఎలా ఉంది..నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకోకుండా వరుసగా కార్యక్రమాలు ఇవ్వడంపై ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందని సమాచారం.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న విషయం ఆ పార్టీ శ్రేణులు కూడా అంగీకరిస్తున్నాయి. వైసీపీ దూకుడును టీడీపీ నిలవరించలేకపోతోందనే భావన చాలామందిలో వ్యక్తమవుతోంది. మరోవైపు పార్టీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి పోరాటాలు చేస్తున్నా.. పార్టీ కార్యకర్తల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఉత్సాహం రావడం లేదనే వాదన ఉంది. అయితే ఈ విషయంలో టీడీపీ నాయకత్వం కూడా కొన్ని పొరపాట్లు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. టీడీపీలో ప్రోగ్రాం కమిటీ అని ఒకటి ఉంటుంది. పార్టీలోని అన్ని కార్యక్రమాలు, నేతల పనితీరును పరిశీలించే వింగ్‌గా ఈ కమిటీని పిలుస్తారు. అయితే ఈ కమిటీ తీరు ఆశించినట్టుగా లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఎప్పుడంటే అప్పుడు.. ఏదంటే అది మెసేజ్‌లు పెట్టి నిరసనలు చేయాలని ఈ కమిటీ నుంచి కేడర్‌కు మెసేజ్‌లు వస్తున్నాయని సమాచారం. మొదట్లో ప్రోగ్రామ్ కమిటీ నుంచి వచ్చే సూచనల ఆధారంగా పని చేసిన శ్రేణులు, నేతలు... ఇప్పుడు మాత్రం ఈ కమిటీని అంతగా పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది.

    ప్రోగ్రామ్‌ కమిటీల నుంచి వచ్చే మెసేజ్‌లను లైట్‌ తీసుకోవడం మొదలుపెట్టారని సమాచారం. మరీ తప్పదని అనుకుంటే.. ఓ నలుగురు తమ పార్టీ కార్యాలయం వద్దనే రోడ్డెక్కుతున్నారట. అందుకు సంబంధించిన ఫోటోలను పార్టీ కమిటీకి పంపిస్తున్నారట. పార్టీ కింది స్థాయిలో ఎలా ఉంది..నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకోకుండా వరుసగా కార్యక్రమాలు ఇవ్వడంపై ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందని సమాచారం. దీంతో స్వయంగా చంద్రబాబు నేలపై కూర్చున్న సందర్భంలోనూ అనుకున్న స్థాయిలో క్యాడర్ రోడ్డెక్కలేకపోయిందనే ప్రచారం సాగుతోంది.

    అయితే ఈ కమిటీ చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తోందనే వాదన కూడా ఉంది. టీడీపీ నిరసనలతో రాష్ట్రం హోరెత్తిపోయిందన్నట్టుగా ఈ కమిటీ చంద్రబాబుకు నివేదికలు ఇస్తోందని కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. పార్టీ అధినేతను సంతృప్తిపరిచేందుకు.. ఆయనకు అసలు విషయాలు తెలియకుండా చేస్తున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. మొత్తానికి టీడీపీలోని కీలక కమిటీ క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి గురించి తెలుసుకోకుండా వ్యవహరిస్తోందనే చర్చ మొదలైంది.
    Published by:Kishore Akkaladevi
    First published: