ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఇక మనం ప్రతి రోజూ ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటోంది... రాజకీయ సమీకరణాలు ఎలా మారుతున్నాయి అనేది చూస్తూ ఉంటాం. ఐతే... దేశవ్యాప్తంగా అందర్నీ ఆకర్షిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. ఎందుకంటే ఇక్కడ పోటీ టీడీపీ వర్సెస్ వైసీపీతోపాటూ... టీడీపీ వర్సెస్ బీజేపీలా కూడా ఉంది కాబట్టి. పార్టీల సంగతెలా ఉన్నా... అవి ప్రకటించిన పథకాలు మాత్రం ఈసారి ఎక్కువ చర్చకు దారితీశాయి. సమస్యేంటంటే... 2014 ఎన్నికల్లో వైసీపీకి తగ్గిన ఓట్లు ఐదున్నర లక్షలు అంటే ఒకటిన్నర శాతమే. ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉంటే... ఫలితం తమకు అనుకూలంగా ఉండేదని భావించిన ఆ పార్టీ ఈసారి ఎక్కువ జాగ్రత్త పడుతోంది. నవరత్నాల పేరుతో ఆకర్షణీయ పథకాలు ప్రకటించింది. అధికారాన్ని చేజార్చుకోవడానికి సిద్ధంగాలేని టీడీపీ... ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పెన్షన్ల అమౌంట్ పెంచడంతోపాటూ... అన్నదాత సుఖీభవ కింద రైతులకు పంటసాయం, పసుపు-కుంకుమ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవన్నీ చూసిన వైసీపీ... మరిన్ని మంచి పథకాలతో జనంలోకి వెళ్తోంది.
టీడీపీ పథకాలు :
సుఖీభవ - రైతులకు రూ.15,000 పెట్టుబడిసాయం. 54 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులకు లాభం. ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.15వేలు పంటసాయం ఇవ్వనున్నారు. ఈ డబ్బులో కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కూడా కలిపి వుంటాయి. అదే ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రూ.10 వేలు ఇవ్వనుంది. ఫలితంగా మొత్తం 94 లక్షల మంది రైతులకు మేలు జరగనుంది.
ఎన్టీఆర్ భరోసా : ఈ స్కీం కింద ఏపీలో పెన్షన్ల సంఖ్య 53 లక్షలు దాటనుంది. ఈమధ్యే మరో రెండున్నర లక్షల పెన్షన్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటితో కలిపి పెన్షన్ల సంఖ్య 53 లక్షల 11 వేలవుతుంది. అందువల్ల దేశంలోనే ఇది పెద్ద పథకం అంటున్నారు.
పసుపు-కుంకుమ : దీని ద్వారా ఏపీలో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరబోతోంది.
నిరుద్యోగ బృతి : దీని కింద నెలకు రూ.2,000 చొప్పున మొత్తం 5 లక్షల మందికి మేలు జరగనుంది.
ఇక సంక్షేమ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల మందికి ప్రయోజనం కలిగేలా టీడీపీ ప్లాన్ వేసింది. తద్వారా అన్ని వర్గాల ఓట్లనూ రాబట్టుకోవాలని చూస్తోంది.
వైసీపీ పథకాలు :
రైతన్న భరోసా : ఏపీలో రైతులకు పంటసాయం కింద రూ.12,500 చొప్పున నాలుగు పర్యాయాలు ఇస్తామని ఆ పార్టీ అధినేత జగన్ ప్రకటించారు. ఫలితంగా ఈ పథకం ద్వారా ఏటా రైతులకు రూ.50,000 అందనుంది.
వడ్డీ లేని పంట రుణాలు, తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్, ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,000 కోట్లు కేటాయింపు, ముందుగానే పంట ధర నిర్ణయం, ఆ ధరకు ఎవరూ కొనకపోతే, ప్రభుత్వమే కొంటుందని జగన్ ప్రకటించారు.
కేంద్రంతో కలిసి రూ.4000 కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధి ఏర్పాటు మరో అంశం.
అమ్మ ఒడి : పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికీ... ఏటా రూ.15,000 ఇస్తారు. పిల్లలు ఎంత వరకూ చదివితే అంతవరకూ అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. పిల్లల హాస్టల్ ఖర్చులకు ఏటా రూ.20,000 ఇస్తామని ప్రకటించారు.
ముసలివాళ్ల పెన్షన్ వయస్సును 65 నుంచీ 60 ఏళ్లకు తగ్గిస్తామన్నారు. అందరికీ నెలకు రూ.2,000 పెన్షన్ ఇస్తామన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,000 ఇస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్సార్ చేయూత ఫించన్ : ఈ స్కీం ద్వారా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే నెలకు రూ.2,000 ఇస్తామని జగన్ ప్రకటించారు. అదే చేస్తే... ఇప్పుడు పెన్షన్లు పొందుతున్నవారికి డబుల్ సంఖ్యలో లబ్దిదారులు పెరుగుతారు.
ఇలాంటి పథకాలతో వైసీపీ కూడా రాష్ట్రంలోని అన్ని రకాల వర్గాల ఓటర్లనూ ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదనంగా వైద్యం ఖర్చు రూ.1000 దాటితే, అది ఏ వ్యాధి అయినా ఆరోగ్యశ్రీ స్కీం కిందకు తెచ్చి సాయం చేస్తామన్నారు.
ప్రతి పేదవాడికీ ఇల్లు కట్టిస్తామన్న జగన్... ఏటా 5 లక్షల చొప్పున ఐదేళ్లలో 25లక్షల ఇళ్లు కట్టి ఇస్తామని హామీ గుప్పించారు. ఇంటిని మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయిస్తానన్నారు. అవసరమైనప్పుడు ఆ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి... పావలా వడ్డీకే రుణం తీసుకునేలా చేయిస్తానన్నారు.
మద్య నిషేధాన్ని మూడు దశల్లో నిర్మూలిస్తామన్న జగన్... తాగుడు మానేసేవారికి సరైన ట్రీట్‌మెంటే కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తానన్నారు. మద్యాన్ని నిషేధించాకే 2024 ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని అన్నారు.
ఇలా రెండు పార్టీలూ అదిరిపోయే పథకాల్ని ప్రకటించి... ఏ పార్టీ కావాలో తేల్చుకోమని జనానికి పరీక్ష పెట్టారు. మరి మనం ఎవరికి ఓటు వేస్తామన్నది ఈవీఎంలకే చెబుదాం. ఫలితాలప్పుడే మిస్టరీ రివీల్ చేద్దాం.
ఇవి కూడా చదవండి :
మా అధ్యక్షుడైన నరేష్... ఎన్నికల్లో భారీ విజయం
CWC జాబ్ రిక్రూట్‌మెంట్... 571 పోస్టులు... అకౌంటెంట్లు, ట్రాన్స్‌లేటర్లు...
RRB Recruitment 2019 : 1000కి పైగా పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్
NHB జాబ్స్... అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు... శాలరీ రూ.42,000
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Lok Sabha Election 2019