
పొలాల్లో దిగిన హెలికాప్టర్
తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూయలరీ అధినేత శ్రీనివాసన్‌తో పాటు ఆయన కుటుంబానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవలరీ అధినేత శ్రీనివాసన్‌తో పాటు ఆయన కుటుంబానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీనివాసన్ తన కుటుంబంతో కలిసి కోయంబత్తూరు నుంచి తిరుమలకు హెలీకాప్టర్ ద్వారా బయలు దేరారు. అయితే కుప్పం సరిహద్దులోని తిరుపత్తూరు జిల్లాలో పొగమంచు కమ్మేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా కాసేపు గాల్లో చక్కర్లు కొట్టిన హెలీకాప్టర్ ఇక ముందుకు కదలలేని పరిస్థితిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరుపత్తూరులోని నంగిలి వద్ద పంట పొలాల్లో హెలీకాప్టర్ క్షేమంగా ల్యాండ్ అవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తిరుపత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. అయితే కొద్ది సేపటి తర్వాత వాతావరణం అనుకూలించడంతో హెలీకాప్టర్ తిరుపతికి బయలుదేరింది. హెలీకాప్టర్‌లో ఇద్దరు పైలెట్లతో సహా ఏడుగురు ప్రయాణిస్తున్నారు. పొలాల్లో దిగిన హెలీకాప్టర్‌ను చూసేందుకు స్థానిక ప్రజలు తరలివచ్చారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:October 18, 2020, 15:38 IST