news18-telugu
Updated: November 26, 2020, 3:25 PM IST
సీఎం జగన్ (ఫైల్ ఫోటో)
రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో మరో ఆదేశం వెలువడింది. అమరావతి భూములు కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ విచారణపై ఏపీ హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్‌ను ఎత్తేస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసిన మరుసటి రోజే.. మరో అనుకూల ఆదేశం వెలువడింది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు వ్యవహారంలో సుప్రీంకోర్టు.. జగన్ సర్కార్ చర్యలను సమర్థించింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను అమలు చేయకుండా ఏపీ హైకోర్టు ఇదివరకు జారీ చేసిన ఉత్వర్వులపై స్టే ఇచ్చింది. తనను సస్పెండ్ చేస్తూ జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఏబీ వెంకటేశ్వర రావు ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు. తనపై సస్పెన్షన్‌ను అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఎత్తేయకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాలను పక్కనపెట్టి.. వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఏపీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వాటిని పక్కన పెట్టింది. సస్పెన్షన్ చెల్లదని పేర్కొంది. సస్పెన్షన్ కాలానికి వేతనాన్ని కూడా చెల్లించాలంటూ ఈ ఏడాది మేలో ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆయనను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందనే విషయాన్ని వివరంగా వెల్లడించింది. దీనిపై ఓ నివేదికను సమర్పించింది. దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. రెండు, మూడు దఫాలుగా వాదోపవాదాలను ఆలకించింది. సస్పెన్షన్ ఎత్తివేస్తే దర్యాప్తుపై ప్రభావం ఉంటుందని ప్రభుత్వం వాదించింది.
ఇవి కూడా చదవండి
ఏబీ వెంకటేశ్వరరావు తన కుమారుడి కంపెనీ పేరుతో దేశ భద్రతకు ముప్పు కలిగేలా కొన్ని పరికరాలు తెప్పించుకున్నారని ఆరోపణలను ఎదుర్కొంటున్నారని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. శాఖాపరమైన దర్యాప్తులో భాగంగా తాము సస్పెన్షన్ చేయాల్సి వచ్చిందని వివరించారు. వాదోపవాదాలను విన్న తరువాత.. సుప్రీంకోర్టు తన ఆదేశాలను వెల్లడించింది. సస్పెన్షన్ చెల్లుబాటులోకి వస్తుందని పేర్కొంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టేను జారీ చేసింది. ఈ విషయంలో క్యాట్ ఆర్డర్‌ను సమర్థించక తప్పదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అన్ని వివరాలు, అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాతే క్యాట్ తన తీర్పును వెలువరించిందని, దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు న్యాయవాదులు చెబుతున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 26, 2020, 2:15 PM IST