హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు భారీ ఊరట.. హైకోర్టు విచారణపై స్టే

Andhra Pradesh: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్‌కు భారీ ఊరట.. హైకోర్టు విచారణపై స్టే

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్ పోటో)

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్ పోటో)

Andhra Pradesh: ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తామని.. దీనిపై విచారణ జరుపుతామని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

  ఏపీలోని జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తేలుస్తామని.. దీనిపై విచారణ జరుపుతామని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. హైకోర్టు జడ్జి ఎందుకు అలా అన్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో వ్యవస్థ ఏమీ కుప్పకూలలేదు కదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధిం తదుపరి విచారణను శీతాకాల సెలవుల అనంతరం చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా తేలుస్తామని అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలన్న ఏపీ ప్రభుత్వం హైకోర్టు అభ్యర్థించింది. అయితే కొద్దిరోజుల క్రితం దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

  ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులు ప్రైవేటు సైన్యంగా మారి కొంత మంది కిడ్నాపులు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పోలీసులు వ్యక్తుల్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకుంటున్నారని... ఈ వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలయ్యాక ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయడమో, మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచడమో చేస్తున్నారని తెలిపింది. దీనిపై డీజీపీని కోర్టుకు పిలిపిస్తే ఆయన ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారని... కానీ పోలీసులు హద్దుమీరి వ్యవహరిస్తూనే ఉన్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయవ్యవస్థపై పలువురు దాడి చేశారని... అందులో అధికార పార్టీ ఎంపీ కూడా ఉన్నారని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజల హక్కుల్ని రక్షించాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా? లేదా? అనేది నిర్ణయించేందుకే ఈ రకమైన ఉత్తర్వులిచ్చామని హైకోర్టు తెలిపింది.

  అయితే మూడు రోజుల క్రితం రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అనే అంశంపై విచారణలో భాగంగా హైకోర్టు ధర్మాసనానికి, అడ్వొకేట్‌ జనరల్‌కు మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. ఈ అంశంపై ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని.. విచారణను వాయిదా వేయాలన్న అడ్వకేట్ జనరల్ అభ్యర్థనను తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళితే వెళ్లొచ్చని.. కానీ ఇక్కడ విచారణను ఆపేది లేదని తేల్చిచెప్పింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP High Court, Supreme Court

  ఉత్తమ కథలు