SUPREME COURT NOTICE TO ELECTION COMMISSION AGAINST JAIL FOR EVM COMPLAINTS NK
EVMలపై రాంగ్ కంప్లైంట్ ఇస్తే 6 నెలల జైలు... ఇలాంటి రూల్ కూడా ఉంది తెలుసా...
ప్రతీకాత్మక చిత్రం
EVM and VVPAT : ఎన్నికల్లో వేలిపై సిరా గుర్తు వెయ్యించుకోవడంత, ఓటు వెయ్యడం వంటివి మనందరికీ తెలుసు. కానీ ఓ కొత్త నిబంధన కలకలం రేపుతోంది. అదేంటో తెలుసుకుందాం.
AP Assembly Election 2019 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది... దాదాపు 30 శాతం ఈవీఎంలు సరిగా పనిచెయ్యలేదని కొందరు ఆరోపించారు. అంటే 45 వేల ఈవీఎంలలో దాదాపు 13వేల ఈవీఎంలు మొరాయించినట్లు లెక్క. ఎన్నికల అధికారులు మాత్రం... 400 ఈవీఎంలు మాత్రమే ఇబ్బంది పెట్టాయని, వాటిలో 100 ఈవీఎంలను మార్చామనీ, మిగతా 300 ఈవీఎంలను సరిచేశామని చెప్పారు. ఇదంతా తెలిసిన విషయమే అయినా దీన్ని ఇప్పుడు గుర్తు చెయ్యడానికి ఓ ప్రధాన కారణం ఉంది. అదేంటంటే... ఈవీఎంల పనితీరుపై ఇష్టారాజ్యంగా మాట్లాడితే కుదరదట. ఆరోపణలు చేసేటప్పుడు అసత్య ఆరోపణలు చేస్తే ఆరు నెలల జైలు శిక్ష పడుతుంది. అలాంటి రూల్ ఒకటి ఉంది. దాని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
సపోజ్ మనం వెళ్లి ఈవీఎంలో ఓటు వేశాం. వీవీప్యాట్ యంత్రంలో స్లిప్పు కనిపించింది. మనం ఏ గుర్తుకు ఓటు వేశామో, వీవీప్యాట్ స్లిప్పు కూడా అదే గుర్తుకు వేసినట్లే చూపించింది. కానీ అది 7 సెకండ్లలో లోపలికి వెళ్లిపోతుంది కదా. అప్పుడు మనకు డౌట్ వస్తే, మనం వేసిన ఓటుకు కాకుండా మరో గుర్తుకు ఓటు పడిందని మనం అనుకున్నామనుకోండి. ఇదే విషయాన్ని ఎన్నికల అధికారికి చెబితే... వాళ్లు చెక్ చేశారని అనుకుందాం. అలా చెక్ చేసినప్పుడు మన అనుమానం నిజం కాదనీ, ఈవీఎం బాగానే పనిచేసిందని తేలుతుంది కదా. అప్పుడు అసత్య ఆరోపణ చేసినందుకు మనల్ని 6 నెలల పాటూ జైల్లో పెట్టవచ్చట. లేదంటే రూ.1000 జరిమానా వేస్తారట. ఈ భయంకరమైన నిబంధన కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంది. ఎన్నికల నిబంధనల్లోని సెక్షన్ 49 MA ఈ రూల్‌ని వివరిస్తోంది. IPCలోని సెక్షన్ 177 (అసత్య సమాచారం ఇవ్వడం) ప్రకారం శిక్ష అమలు చేస్తారు.
ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయని ఎవరనుకుంటారు. కానీ సునీల్ ఆహ్యా అనే ఓ వ్యక్తి ఈ రూల్ ఉందని గుర్తించారు. ఇది ఓటర్ల కొంప ముంచేలా ఉందని భావించారు. ఆలస్యం చెయ్యకుండా వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి నిబంధన వద్దనీ, దీన్ని రద్దు చెయ్యాలనీ కోరారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉందనీ, ఓటర్లు స్వేచ్ఛగా కంప్లైంట్ ఇచ్చే అవకాశాన్ని ఇది దూరం చేస్తోందని అన్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీస్ ఇచ్చింది. ఇప్పుడీ రూల్ తొలగిస్తే, మనకు మేలు జరుగుతుంది. అదే తొలగించకపోతే, మనలాంటి వాళ్లం ఈవీఎంల పనితీరుపై కంప్లైంట్ చెయ్యడానికి సాహసించలేం. ఈసీ ఏమంటుందో త్వరలో తెలుసుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.