బంగాళాఖాతంలో ఆవర్తనం... తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు ఎండలే...

Southwest Monsoon : ఇంకేముంది రెండ్రోజులు ముందుగా నైరుతీ వచ్చేస్తుంది అన్నారు వాతావరణ అధికారులు... తీరా చూస్తే... 10 రోజులు ఆలస్యమైనా ఇప్పటికీ రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్ని పలకరించేలా లేవు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 17, 2019, 5:45 AM IST
బంగాళాఖాతంలో ఆవర్తనం... తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు ఎండలే...
ఎండలే ఎండలు (ప్రతీకాత్మక చిత్రాలు)
  • Share this:
వాతావరణాన్ని అంచనా వెయ్యడం వాతావరణ అధికారుల వల్ల కావట్లేదు. కేరళను రెండ్రోజులు ఆలస్యంగా తాకిన రుతుపవనాలు... ఆ తర్వాత దక్షిణాదిలో విస్తరించాలి. తెలుగు రాష్ట్రాల్ని పలకరించాలి. కానీ అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాను మొత్తం సీన్ మార్చేసింది. కుదురుగా వస్తున్న రుతుపవనాల్ని అల్లకల్లోలం చేసేసింది. ఫలితంగా రుతుపవనాల్లో చల్లదనం పోయింది. అదే సమయంలో... రావాల్సిన సమయానికి అవి రాకపోవడంతో తెలుగు రాష్ట్రాలు రోహిణీ కార్తె వెళ్లిపోయిన తర్వాత కూడా... భగ్గుమంటూనే ఉన్నాయి. ఐతే... ఉత్తర బంగాళాఖాతంలో 4.5 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఓ నాల్రోజుల్లో అది అల్పపీడనంగా మారుతుందట. దాని వల్ల పెద్దగా వర్షాలు పడే అవకాశాలు లేవుగానీ... రుతుపవనాలు జోరందుకునేందుకు కాస్త ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అగ్నిగుండంలా ఏపీ : సహజంగానే ఏపీలో ఎండలు ఎక్కువ. ఇక ఇప్పుడు రుతుపవనాలు రాకపోవడంతో... ఎండలు తగ్గట్లేదు. జనరల్‌గా ఈ టైంలో ఏటా ఉండేదానికంటే... ఇప్పుడు మరో 6 డిగ్రీలు ఎక్కువ వేడి ఉంటుందంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 నుంచీ 43 డిగ్రీల దాకా ఉంటున్నాయి. ఇవాళ, రేపు ఏపీలో వేడి గాలులు కూడా వీస్తాయంటున్నారు.

తెలంగాణలోనూ అదే సీన్ : నీటి కోసం రైతన్నలు ఆశగా చూస్తున్నారు. వర్షాలు పడకపోవడంతో... ఖరీఫ్ పంట వేసేందుకు ఆలస్యమవుతోంది. ఉత్తర తెలంగాణ నిప్పుల కుంపటిలా మారింది. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు 42 నుంచీ 40 డిగ్రీల దాకా ఉంటున్నాయి. ఒక్క హైదరాబాద్‌లో మాత్రం 36 నుంచీ 38 డిగ్రీలు ఉంటోంది.

వడదెబ్బకు 15 మంది మృతి : తెలంగాణలో ఎండలు, వేడి గాలులు తగ్గకపోవడతో... ఆదివారం ఒక్కరోజే 15 మంది చనిపోయారంటే నమ్మగలరా. పరిస్థితి అంత తీవ్రంగా ఉంది. వాయు తుఫాను వల్ల వాతావరణంలో వేడి ఎక్కువవ్వడం వల్లే... డీహైడ్రేషన్ సమస్యతో పెద్దవాళ్లు, ముసలివాళ్లు, పిల్లలు చనిపోతున్నారు.రుతుపవనాలు వచ్చేదెప్పుడు ? : తాజా అంచనాల ప్రకారం... కేరళలో వర్షాలు పడుతుంటే... కర్ణాటకలో మేఘాలున్నాయి. అవి అలా కదులుతూ... ఏపీలోకి 19 కల్లా వచ్చే ఛాన్సుంది. ఆ తర్వాత 20కి తెలంగాణను టచ్ చేస్తాయి. ఆ వాయు తుఫాను... ఇవాళ రాత్రికి వాయుగుండంగా మారుతుంది. తీరం దాటుతుంది. అది వెళ్లిపోతేనే రుతుపవనాలు ముందుకు కదులుతాయి.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 43 శాతం తక్కువ వర్షం కురిసింది. చెట్లను నరికేస్తుండటం, వాహనాల వాడకం పెరగడం ఇలా ఎన్నో అంశాలు వాతావరణంలో వేడిని పెంచేస్తూ... వర్షాలను దూరం చేస్తున్నాయి.
First published: June 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు