Home /News /andhra-pradesh /

వీధి కుక్కలకు విషం.. విజయవాడ అధికారుల తీరుపై దుమారం

వీధి కుక్కలకు విషం.. విజయవాడ అధికారుల తీరుపై దుమారం

కుక్కలపై ఇంజెక్షన్లతో విష ప్రయోగం

కుక్కలపై ఇంజెక్షన్లతో విష ప్రయోగం

వీధికుక్కలే కాదు ఏ మూగ జీవాలతోనైనా ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లి వదిలేయాలని మాత్రమే నిబంధనలు చెబుతున్నాయి.

  (సయ్యద్ అహ్మద్, విజయవాడ న్యూస్ 18 ప్రతినిధి)

  ఏపీ రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ మహానగరంలో వీధి కుక్కలపై దాడులు కలకలం రేపుతున్నాయి. శివారు ప్రాంతమైన రామవరప్పాడు గ్రామ పరిధిలో దాదాపు 20 వీధికుక్కలను నిన్న పంచాయతీ సిబ్బంది విషపూరిత రసాయన ఇంజెక్షన్లు ఇచ్చి చంపేశారు. ఈ వ్యవహారం కాస్తా నగర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో జంతుప్రేమికులు మండిపడుతున్నారు.

  కొన్నేళ్లుగా విజయవాడ నగరంలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉంటోంది. పలు సందర్భాల్లో ఇవి చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్లను సైతం కరుస్తుండటంతో వారు గాయాలపాలవుతున్నారు. కొన్నిసార్లు కుక్కకాటు మందులు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయలు ఖర్చుపెట్టుకోవాల్సిన పరిస్ధితి నెలకొంటోంది. వీధి కుక్కలను నియంత్రించడంలో అధికారుల అలసత్వం ఎక్కువైదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో స్పందించిన సిబ్బంది... వీధి కుక్కలపై ప్రతాపం చూపడం మొదలుపెట్టారు. వీధుల్లో తిరుగుతున్న కుక్కలను గమనించి కొన్నిరోజులుగా వాటిని పట్టుకుని విషపూరిత ఇంజెక్షన్ల ద్వారా చంపేస్తున్నారు. తాజాగా నిన్న నగర శివారు ప్రాంతమైన రామవరప్పాడులో స్ధానిక పంచాయతీ సిబ్బంది దాదాపు 20 కుక్కలను ఇదే విధంగా పట్టుకుని వాటిని బలి తీసుకున్నారు.

  మూగ జీవాలతో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమే అయినా వాటిని ఇంత క్రూరంగా బలితీసుకోవడంపై మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి. పంచాయతీ సిబ్బంది కుక్కలను వేటాడుతున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు స్ధానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు స్ధానికంగా ఉన్న కొన్ని జంతు సంరక్షణ సంస్ధలకు ఫోన్లు చేశారు. దీంతో ఆయా సంస్ధల ప్రతినిధులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పంచాయతీ సిబ్బంది తమపని కానిచ్చేశారు. దీంతో పంచాయతీ సిబ్బంది తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీ ప్రతినిధి తేజోవంత్ పంచాయతీ సిబ్బంది మూగ జీవాలను బలితీసుకోవడం దారుణమన్నారు.

  మూగజీవాలపై మూక దాడులు సరికాదు. గతంలోనూ గుంటూరులో అధికారులు ఇలాంటి దాడులకు పాల్పడి 50 కుక్కలను పొట్టనపెట్టుకున్నారు. అప్పట్లోనూ మేం దీనిపై తీవ్రంగా పోరాటం చేశాం. మూగ జీవాలపై హింసకు వ్యతిరేకంగా దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. అయినా వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. విజయవాడలో జరిగిన తాజా దాడిపై మా పోరాటం కొనసాగుతుంది. తేజోవంత్,
  హెల్ప్ ఫర్ యానిమల్స్ సొసైటీ సభ్యుడు


  వీధికుక్కలే కాదు ఏ మూగ జీవాలతోనైనా ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని జనావాసాల నుంచి దూరంగా తీసుకెళ్లి వదిలేయాలని మాత్రమే నిబంధనలు చెబుతున్నాయి. కానీ నగరీకరణ కారణంగా మారుతున్న పరిస్దితుల్లో ఒక ప్రాంతం నుంచి మూగ జీవాలను తీసుకెళ్లి మరో చోట వదిలే పరిస్ధితులు కానీ, అందుకు అయ్యే రవాణా ఖర్చులు భరించే పరిస్ధితి కానీ ప్రస్తుతం స్ధానిక సంస్దలకు లేదు. దీంతో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. వీటిపై ప్రభుత్వాలు తగిన చట్టాలు చేయడంతో పాటు స్ధానిక సంస్ధలకు తగిన నిధులు ఇచ్చి వాటిని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.
  First published:

  Tags: Stray dogs, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు