పదో తరగతి పాసైనందుకు ఆ అమ్మాయి పట్టరాని సంతోషంతో ఎగిరి గంతేసింది. కుటుంబ సభ్యులకు కూల్డ్రింక్స్ ఇచ్చి తన ఆనందాన్ని పంచుకుందామని అనుకుంది. కానీ అంతలోనే ఎవరూ ఊహించని దారుణం జరిగింది. టాటా ఏస్ రూపంలో మృత్యువు దూసుకొచ్చి బాలికను ఛిదిమేసింది. తీవ్ర గాయాలతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం కలవచర్ల గ్రామంలో ఈ విషాదకరమైన ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం విడుదలైన ఏపీ ssc ఫలితాల్లో కలవచర్ల గ్రామానికి చెందిన రుక్మిణి (15) పాసయింది. ఆ ఆనందంలో కూల్డ్రింక్స్ కొనుకుందామని చెల్లెలితో కలిసి రోడ్డుపైకి వెళ్లింది. అదే సమయంలో అతి వేగంతో దూసుకొచ్చిన టాటా ఏస్ వాహనం అక్కాచెల్లెల్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రుక్మిణి చనిపోగా..ఆమె చెల్లెలికి గాయాలయ్యాయి. గాయపడి చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పటి వరకు తమ కళ్లముందే ఉన్న కూతురు ఇప్పుడు విగతజీవిగా మారడంతో రుక్మిణి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.