Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18
అందరికీ తుఫాను అంటే హుద్ హుద్ మాత్రమే. కానీ.. శ్రీకాకుళం (Srikakulam), ఒడిశా (Odisha) తీర ప్రాంత వాసులకు మాత్రం తుఫానులు చుట్టాల్లా వచ్చి పోతుంటాయి. వందేళ్లలో హుద్ హుద్ లాంటి తుఫాను ఒక్కటే విశాఖను తాకి.. చిందరవందర చేసింది. జనజీవనం స్తంభించేలా భయకంపితుల్ని చేసింది. కానీ.. ఇలాంటి తుఫాన్లు ఎన్నో ఉద్దానం, ఒడిశా, గోపాల్ పూర్ వంటి ప్రాంతాలు చవి చూశాయి. అయితే అలాంటి తుఫాన్లు వచ్చేది మాత్రం అక్టోబర్‌లోనే. ఈ నెలలోనే విశాఖ (Visakha) లో హుద్ హుద్ వచ్చి అతలాకుతలం చేయడం గమనార్హం.
అక్టోబరు నెల అంటేనే రైతులు హడలిపోతున్నారు. ఏటా ఇదే నెలలో ప్రకృతి వైపరీత్యాలు లేదా ఏదో ఒక విపత్తు సంభవించడమే ఇందుకు కారణం. గతంలో పెను తుఫాన్లన్నీ అక్టోబరులో వచ్చి.. విధ్వంసం సృష్టించాయి. 1999వ సంవత్సరం అక్టోబరు చివరి వారంలో వచ్చే తుఫాన్ పూర్తిగా మార్చేసింది. వందలాది ఎకరాల్లో కొబ్బరి, జీడి చెట్లు నేలకూలాయి. ఉద్దానం ప్రాంత రైతుల బతుకులు తలకిందులయ్యాయి.
తర్వాత 2012వ సంవత్సరం అక్టోబరులో ఫైలిన్, 2013వ సంవత్సరం అక్టోబరులో హుద్‌హుద్ తుఫాన్లు కూడా రైతులను నిలువునా ముంచేశాయి. కొబ్బరి, జీడి, మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. 2018 అక్టోబరులో వచ్చిన తితలీ తుఫాన్ మరింత బీభత్సం సృష్టించింది. ఉద్దానంలో వేలాది ఎకరాల్లో కొబ్బరి, జీడి, మామిడి చెట్లు నేలకొరిగాయి.
ఇదీ చదవండి : కలెక్టరేట్లో అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది..! ఆ ముప్పు తప్పించింది ఎవరో తెలుసా
కొబ్బరి, జీడి, మామిడి, వరి, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు ముప్పు వాటిల్లి.. రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. తాజాగా అల్పపీడన భయం రైతులను వెంటాడుతోంది. నాలుగైదు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ సారి తమకు ఎంత నష్టం మిగులుతుందోనని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి : ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే కానుక.. అధికారిక ఉత్తర్వులు జారీ
కొబ్బరి పంటతో కళకళలాడే ఉద్దానం ప్రాంత స్వరూపాన్ని.. ఈ తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇలా ఏటా అక్టోబరులోనే వచ్చే తుఫాన్లు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు ముమ్మరంగా కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి : ఏపీలో జిల్లాలు ఎన్నో పవన్ కు తెలియదా..? మంత్రి స్ట్రాంగ్ కౌంటర్
గాలుల ప్రభావంతో కొబ్బరి చెట్లు కూలిపోతే.. తమకు ఇక వలసలు తప్పవని వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్నా.. తమకు ప్రభుత్వం సక్రమంగా పరిహారం అందజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు చాలామంది రైతులకు పైలిన్ తుఫాన్ పరిహారం అందలేదని పేర్కొంటున్నారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో కూడా వేలాది చెట్లు నేలకూలగా.. రుణమాఫీలో కొబ్బరి రైతుల పేర్లను చేర్చలేదన్నారు.
ఇదీ చదవండి : నేను ఛానెల్ పెడుతున్నా..? ఆ ఇద్దరికీ విజయసాయి రెడ్డి సవాల్
తితలీ తుఫాన్‌కు సంబంధించి.. అదనపు పరిహారం కూడా చాలామందికి అందలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతులందరినీ ఆదుకోవాలని కోరుతున్నారు. అక్టోబర్ నెల మొదలుఅయినప్పటి నుంచి రాష్ట్రమంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో అక్టోబర్ నెల రావడంతో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని సిక్కోలు వాసులు భయాందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Local News, Srikakulam, Visakhapatnam, Vizag