Bear Dead: గత కొన్ని రోజుల నుంచి శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) పరిసర ప్రాంత ప్రజలకు నిద్ర లేకుండా చేసింది. నిత్యం ఎఎకరో ఒకరిపై దాడి చేస్తూ.. భయపెట్టింది. తాజాగా ఉద్ధానంలో ప్రజలపై దాడి చేసిన ఎలుగుబంటి చనిపోయింది. తీవ్రమైన గాయాలతో విశాఖ (Visakha) కు తరలిస్తుండగా ఎలుగుబంటి చనిపోయినట్లు (Bear Dead) అధికారులు ప్రకటించారు. ఉద్ధానంలో సోమవారం తెల్లవారుజామున పొలం పనుల కోసం వెళ్లిన కొందరిపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. కొందరు ఈ దాడి నుంచి తప్పించుకోగా ఏడుగురు వ్యక్తులు ఎలుగుబంటి దాడిలో గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. అటు ఎలుగుబంటి దాడిలో మనుషులే కాకుండా మూగజీవాలు కూడా గాయపడ్డాయి. సుమారు 10 ఆవులు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో ఉద్దానంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు.
ఎలుగుబంటి మృతికి తీవ్రమైన గాయాలే కారణమని జూ క్యూరేటర్ నందిని సలారియా వెల్లడించారు. ఎలుగుబంటి ప్రతి అవయవానికి తీవ్రగాయాలు ఉన్నాయన్నారు. ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కర్రలతో కొట్టినట్టు కనిపించిందన్నారు. ఇతర జంతువుల దాడిలో కూడా గాయపడిందన్నారు.
తమ దగ్గరకు వచ్చే సరికే ఎలుగుబంటి చనిపోయిందని.. అది ఆడ ఎలుగుబంటిగా నిర్ధారించినట్లు తెలిపారు. అయితే ఎలుగుబంటి మృతికి గల కారణాలను, పోస్ట్ మార్టం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని.. తరువాత బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై ఆలోచిస్తామన్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఎలుగుబంటికి దహనం చేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు ఎలుగు దాడితో ఇంతకాలం స్థానికులు తీవ్రంగా భయపడ్డారు. ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియక.. భయపడుతూ వచ్చారు. చాలామంది నిద్రలేని రాత్రులు కూడా గడిపారు. అయితే ఉదయాన్ని ఎలుగుబంటిని అధికారులు పట్టుకున్నారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎలుగు చనిపోయిందని తెలియడంతో అయ్యో పాపం అంటున్నారు.
ఎలుగు బంటి దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాలో పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల వైద్యానికి అవసరమైన పూర్తి ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ప్రకటించారు.
ఆదివారం ఎలుగు దాడిలో మరణించిన వ్యక్తి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 2.5లక్షలు రూపాయలు చెల్లిస్తామని అనంతరం మరొక 2.5 లక్షల రూపాయలు.. మొత్తంగా ప్రభుత్వం తరపున 5లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. బాధిత కుటుంబాలకు పూర్తి అండగా ఉంటామని మంత్రి డాక్టర్ సీదిరి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.