పెళ్లి జరిగిన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి జరిగిన రెండురోజులకే వధువు వరులు మృతి చెందారు.రోడ్డు ప్రమాదం వారి ప్రాణాల్ని బలితీసుకుంది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఇచ్ఛాపురం నుంచి అత్తారింటికి ఒడిశా రాష్ట్రానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న నవ దంపతులను సోమవారం సాయంత్రం ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నవ వధూవరులిద్దరూ మృతి చెందారు. ఈ విషాద ఘటన ఇరు కుటుంబాలు, స్నేహితులు, ఆత్మీయులందరినీ కంటతడి పెట్టించింది.
ఇచ్ఛాపురంలో పట్టణంలోని బెల్లుపడ కాలనీలో ఉంటున్న 21 ఏళ్ల వేణు అలియాస్ సింహాచలం ఓ బట్టల షాపులో పని చేస్తున్నాడు. ఇతనికి బెర్హంపూర్‌కు చెందిన 18 ఏళ్ల సుభద్ర అలియాస్ ప్రవల్లికతో వివాహం జరిగింది. సింహాచలం క్షేత్రంలో ఈనెల 10వ తేదీన జరిగిన వేడుకల్లో బంధువులు, స్నేహితులు అంతా పాల్గొన్నారు. అమ్మాయి తరఫు వాళ్లు ఈనెల 12వ తేదీ ఆదివారం రోజున ఇచ్ఛాపురంలో విందు ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి దంపతులను ఆశీర్వదించగా... అత్తారింటికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
దీంతో అమ్మాయి, అబ్బాయిని ద్విచక్రవాహనంపై అత్తారింటికి పంపారు. కొత్త జంట బైకుపై అత్తారింటికి బయలు దేరింది. అయితే గొళంత్రా పోలీస్ ఠాణా పరిధిలో ఓ ట్రాక్టర్ వీరి బండిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధూవరూలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సుభద్ర అక్కడికక్కడే మృతి చెందగా... తీవ్ర గాయాలైన వేణును బెర్హంపూర్ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి, అబ్బాయి తరఫు కుటుంబ సభ్యులతో పాటు బంధువులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వేణు తండ్రి రామారావు గతంలోనే చనిపోయారు. అన్నయ్య, అక్క, అమ్మతో కలిసి ఉంటున్నారు. అన్యాయం చేసి వెళ్లిపోయాడంటూ బోరున విలపిస్తున్నారు. నిన్నటి వరకూ పెళ్లి వేడుకతో సందడిగా ఉన్న ఇళ్లు.. నేడు ఏడుపులు, పెడబెబ్బలతో విలవిల్లాడుతున్నాయి. పందిరి, కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఇలా జరగడంతో ఇరు గ్రామాల్లోనూ విషాధ ఛాయలు అలముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Local News, Road accident, Srikakulam