Bear Attack: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల పులులు, ఎలుగుబంట్లు.. ఏనుగుల బెడద పెరుగుతోంది. పలు జిల్లాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి హల్చల్ చేస్తున్నాయి. స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని జిల్లాలోని వజ్రపుకొత్తూరులో ఎలుగు బంటి మరోసారి బీభత్సం సృష్టించింది. ఇప్పటికే ఎలుగు బంటి దాడుల్లో కొందరు బాధితులు కాగా, తాజాగా వజ్రపు కొత్తూరు - కిడిసింగి తోటల్లో జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న ఏడుగురు రైతులపై ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దాడి జరిగిన వెంటనే అక్కడే ఉన్న స్ధానికులు.. క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుండి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక గతంలోనే ఎలుగు బంటి దాడులపై అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం కారణంగానే.. మరోసారి ఎలుగుబంటి వరుస దాడులకు పాల్పడి ఏడుగురిని తీవ్రంగా గాయపరచడం లాంటి ఘటనలు చోటు చేసుకుందని స్దానికులు ఆరోపిస్తున్నారు.
వజ్రపుకొత్తూరు-కిడిసింగి మధ్య జీడి కొబ్బరి తోటల్లోని పని చేస్తున్న రైతులపై ఎలుగు బంటి విరుచుకుపడుతోంది. గత రెండు రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఆదివారం కూడా ఓ రైతుపై దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మ్ళతి చెందాడు. ఎప్పటిలాగే ఉదయం నిద్ర లేచిన కోదండరావు అనే రైతు గ్రామ సమీపంలో ఉన్న తోటకు వెళ్తుండగా సమీప పొదల్లో దాగివున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆయనపై దాడి చేసింది.
ఎలుగు దాడితో ప్రాణ భయంతో ఆయన గట్టిగా కేకలు వేశారు. దగ్గర్లో ఉన్నవారు అక్కడికి వచ్చేసరికి ఎలుగు అక్కడ నుండి పారిపోయింది. ఎలుగు బంటి దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయన మృతి చెందాడు. ఇక సోమవారం రోజు ఉదయం కూడా స్థానికులు అప్రమత్తగా ఉంటూ తోటల్లో పనిచేస్తున్నప్పటికీ ఎలుగు బంటి మరోసారి దాడి చేసి గ్రామస్తులను గాయపరిచింది. ఆదివారమే ఎలుగు దాడి చేయడంతో ఈ ఉదయం కొంత మంది రైతులు, స్ధానికులు భయంతోనే పొలం పనులకు గుంపులుగా వెళ్లారు.
గ్రామస్తులపై ఒక్కసారిగా పొదల నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో వజ్రపు కొత్తూరుకు చెందిన అప్పలస్వామి, పురుషోత్తం, చలపతి, షణ్ముఖరవు, సంతోష్, తులసీదాస్ ల పరిస్థితి విషమంగా ఉండడంతో.. పలాస ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం పట్టణంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఇక ఎలుగుబంటి పంజా దాడిలో 10 పశువులు కూడా తీవ్రంగా గాయపడ్డాయి.
దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎలుగు బంటి సంచారం నేపథ్యంలో అటవీ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కూడా సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు ఆరా తీశారు. క్షతగాత్రులకు కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఎలుగుబంటిని అదుపుచేసేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇదీ చదవండి : వైసీపీ ట్రాప్ లో పవన్..! బాబు డైలమాకు కారణం అదేనా..? మరి జరగబోయేది ఏంటి..?
వజ్రపుకొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎలుగు బంటి దాడుల ఘటనలు కొత్తమే కాదు. గతంలో అనేకసార్లు ఎలుగు దాడి చేసి స్దానికులు గాయపరిచడం, కొంతమందిని పొట్టన పెట్టుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో గతంలో అనేకసార్లు .. ఎలుగు బంటి నుండి రక్షణ కల్పించాలని వజ్రపు కొత్తూరు మండల వాసులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసారు. అయినా అటవీ శాఖ అధికారులు తూతూ మంత్రంగా స్పందిచడం కారణంగా ఎలుగు బంట్ల దాడులు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దీంతో స్ధానికులు ఈ దాడులు అటవీ అధికారుల పుణ్యమేనని, గతంలో అనేక సార్లు ఫిర్యాదు చేసినా.. నిర్లక్ష్యం కారణంగా, పట్టించుకోని కారణంగా ఈ దాడి జరిగిందని.. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆటవీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Srikakulam