నందమూరి బాలకృష్ణ (Balakrishna) వచ్చే ఎన్నికల్లో హిందూపూర్ (Hinsupur) నుంచి పోటీచేయబోరా? వేరొక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారా? తాజా పరిస్థితులను చూస్తుంటే.. అవుననే అనుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది. అలాంటి హిందూపూర్‌లో ఇప్పుడు నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని రోజులుగా టీడీపీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న తారకరత్న.. హిందూపూర్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు ఇంటికి వెళ్లారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం తాజా రాజకీయాలు, హిందూపూర్ స్థితిగతుల గురించి చర్చించారు. వైసీపీ అమలు చేస్తున్న కార్యక్రమాలు, నియోజకవర్గ అభివృద్ధి కూడా చర్చకు వచ్చాయి.
హిందూపూర్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవర్భవించిన తర్వాత.. ఒక్కసారి కూడా ఓడిపోని నియోజకవర్గాల్లో హిందూపురం కూడా ఒకటి..! 1983 నుంచి ఇప్పటి వరకు అక్కడ టీడీపీ అభ్యర్థులు మాత్రమే గెలుస్తున్నారు. ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యులకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే కాదు.. టీడీపీ నుంచి ఎవరు పోటీచేసినా.. అక్కడ ఈజీగా గెలుస్తారు. ప్రత్యర్థులు నామ మాత్రపు పోటీకే పరిమితమవుతారు. ఈ నేపథ్యంలో హిందూపూర్‌లో తారకరత్న పర్యటించడం.. మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడిని కలవడంపై.. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హిందూపురం మాజీ శాసనసభ్యులు శ్రీ వెంకటరాముడు గారిని కలిసి తన యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది. అదే విధంగా తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులను కలుసుకోవటం ఆనందం గా వుంది. pic.twitter.com/iedu2Vh63S
— Nandamuri Taraka Ratna (@NTarakaRatna) January 25, 2023
తారకరత్న కలిసిన సీసీ వెంకటరాముడు.. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించారు. ఐతే 2004 ఎన్నికల్లో ఆయనకు కాకుండా...పామిశెట్టి రంగనాయకులును టీడీపీ బరిలోకి దించింది. అప్పుడు అంతటా వైఎస్ హవా నడుస్తున్నా.. హిందూపూర్‌లో మాత్రం పామిశెట్టి గెలిచారు. ఐతే ఆయన ఇప్పుడు టీడీపీలో లేరు. తెలుగు దేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2004లో తనకు టికెట్ దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు టీడీపీతో అంటీముట్టనట్లుగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా పాల్గొనడం లేదు. రాజకీయాలకే దూరంగా ఉంటున్నారు. ఐనప్పటికీ ఆయనకు హిందూపూర్ నియోజకవర్గంపై మంచి పట్టుకుంది. ఈ క్రమంలోనే ఆయన్ను తారకరత్న కలవడం.. ఆ తర్వాత ఇతర టీడీపీ నేతలు. బాలకృష్ణ అభిమాన సంఘాల ప్రతినిధులను కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపూర్ నుంచి కాకుండా.. వేరొక స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల హిందూపూర్‌లో ఆయన స్థానంలో నందమూరి తారకరత్నను బరిలో దించాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా టీడీపీ కార్యక్రమాల్లో తారకరత్న యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీచేస్తానని పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన హిందూపూర్ నుంచే పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Balakrishna, Hindupuram, Local News