Anna Raghu, News18, Amaravati
ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ఉచిత పథకాలను (Free Schemes) అమలు చేస్తున్నాయి. అంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ ఈ పథకాల సంఖ్య ఎక్కువే. ఐతే ఉచిత పథకాలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం లేదంటూ,ఉచిత పధకాలు ఇలానే కొనసాగితే శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభం మనకూ తప్పదని ఆదివారం ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో కొందరు సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారులు కుండబద్దలు కొట్టారు. మరీ ముఖ్యంగా మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఆయా పార్టీలు అలవికాని హామీలు ఇచ్చాయని, ఆదాయంతో సంభంధం లేకుండా ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత పధకాలు ఆయా రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిని పూర్తిగా చిన్నాభిన్నం చేశాయని వారు ప్రధాని మోది కి వివరించారు.
తెలుగు రాష్ట్రాల విషయంలో అధికారుల ఆందోళన నిజమే అనిపించక తప్పదు. అధికారమే పరమావధిగా ఆయా రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు అమలు చేస్తున్న ఉచిత పధకాలు ప్రభుత్వ ఖజానాలను ఖాళీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో సంక్షేమ పథకాలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో పేదల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తున్నా.. దీని వెనుక ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు లక్షల కోట్ల రూపాయల అప్పులు, అప్పులపై చెల్లించవలసిన వడ్డీ ఏటి కేడు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
అప్పుల ఒత్తిడితో ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేక పోతున్నాయి. పన్నుల రూపేణ వచ్చే కొద్దోగొప్పా ఆదాయం ప్రభుత్వ సాధారణ ఖర్ఛులకు, ఉచిత పధకాల అమలుకు కూడా సరిపోక పోతుండటంతో ఆయా ప్రభుత్వాలు అప్పుల కోసం నానాతిప్పలూ పడాల్సివస్తోంది. ప్రభుత్వ పెద్దల సమయం అంతా నిధుల సమీకరణ మీదే ధృష్టి సారించడంతో పరిపాలన గాడితప్పుతుందనేది మేధావుల వాదన.
మరొక వైపు ఉచిత పధకాలతో ప్రజల జీవితాలలోనైనా ఏమైనా మార్పు తెచ్చారా అంటే అదీ లేదనే చెప్పాలి. ప్రభుత్వాలు అందజేసే ఉచితాలు అనుచితం అంటూ పన్ను చెల్లింపుదారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల రూపేణా తాము చెల్లించే డబ్బును రాష్ట్ర అభివృద్ధికి, ఖజానా పరిపుష్టికి వినియోగించవలసింది మానేసి ఆ డబ్బంతా ఉచితపధకాలవైపు మరలించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు ఉచిత పధకాల అమలుకు డబ్బు సమకూరనప్పుడల్లా వివిధ పన్నులను పెంచుకుంటూ పోతూ తమపై మరింతభారం మోపుతున్నారని పన్ను చెల్లింపుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పన్నులు పెరిగినప్పుడల్లా నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుడి జీవితం మరింత భారంగా మారుతుందని, ఇప్పటి కైనా ఆయా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఖజానాపై ఆర్ధిక భారం మోపుతున్న నిరుపయోగమైన మరియు అలవి మాలిన హామీలను పక్కన పెట్టి మౌళికవసతుల ఏర్పాటు, ఉత్పాదక రంగాలపై ధృష్టి సారాంచాలని ఆర్ధిక రంగనిపుణులు సూచిస్తున్నారు.
అలా కాదని గొప్పలకు పోయి స్వార్ధంతో ఆయా పార్టీలు అలవిమాలిన పథకాలు అమలు చేస్తూ పోతే మాత్రం మన దేశంలో కూడా శ్రీలంక లో ఎదుర్కొంటున్న దానికంటే కూడా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఏర్పడటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చనేది నిపుణుల సూచన. అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు తొమ్మిది సార్లు సీనియర్ అధికారులతో భేటీ నిర్వహించిన ప్రధాని మోడీ ఈ భేటీలో అధికారులను ఆరు బృందాలుగా విభజించి ఆర్ధిక క్రమశిక్షణ,దేశ అభివృద్ధికి కావలసిన సలహాలను ఇవ్వవలసిందిగా వారికి సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap welfare schemes