ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు మరో భారీ పరిశ్రమ రానుంది. ఇప్పటికే పలు దేశీ, విదేశీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతుండగా.. తాగాజా శ్రీ సిమెంట్స్ రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ ప్లాంట్ ఏర్పాటుచేసేందుకు శ్రీ సిమెంట్స్ ఏర్పాట్లు చేస్తోంది. 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్ ఏర్పాటు చేసిన శ్రీ సిమెంట్ గ్రూప్.., ఏపీలో తమ మొట్టమొదటి ప్రాజెక్టును ప్రారంభించబోతోంది. సోమవారం శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఎండీ హెచ్ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్ బంగూర్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ (AP CM YS Jagan) ను కలిసి సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక వర్గాలకు ఇస్తున్న ప్రోత్సాహకాలపై శ్రీ సిమెంట్ మేనేజ్మెంట్ టీమ్‌తో సీఎం జగన్ చర్చించారు.
రాష్ట్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని.. ఒక కంపెనీకి చెందిన ముఖ్యకార్యనిర్వాహణాధికారి ఏరకంగా ఆ కంపెనీ బాగోగులు చూసుకుంటారో.. అలాగే రాష్ట్ర బాగోగులకోసం ముఖ్యమంత్రిగారు కూడా అలాగే పనిచేస్తున్నారని శ్రీ సిటీ ఎండీ అన్నారు. ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని.. రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్ద ఎత్తున జరగాలని సీఎం కోరుకుంటున్నారన్నారు. దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఆదాయాలు రావాలన్నది సీఎం ఉద్దేశంమన్నారు. దేశంకంటే రాష్ట్ర వృద్దిరేటు అధికంగా ఉందని.. భవిష్యత్తులో కూడా ఇది మరింతగా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడ్డారు. . ముఖ్యమంత్రి ఆలోచనా దృక్పథంతో రాష్ట్రాభివృద్ధి మరింత పురోగమిస్తుందని.. అందువల్లే మేం ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు.
శ్రీ సిమెంటు ప్లాంటు లో పనిచేసేవారికి జీతాల రూపంలో కాని, పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారికి గాని నెలకు కనీసంగా రూ.20 కోట్ల రూపాయలు, రోజుకు కనీసంగా రూ.70 లక్షలు రూపాయలు నేరుగా చెల్లిస్తున్నాం, రోజువారీ ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా డబ్బును వారికి ఇస్తున్నానట్లు హెచ్ఎం బంగూర్ తెలిపారు.
పెద్ద సిమెంటు ప్లాంటు ఏర్పాటు వల్ల మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని ప్రశాంత్ బంగూర్ అన్నారు. తద్వారా అనేక మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సర్వీసులను అందించే క్రమంలో చాలామందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. దీని వల్ల వేలమందికి లబ్ధి జరుగుతుందన్నారు. దీంతో ఆజిల్లా, ఆప్రాంతానికి మంచి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ పి వి.మిథున్ రెడ్డి, శ్రీ సిమెంట్ ప్రెసిడెంట్ (కమర్షియల్) సంజయ్ మెహతా, జీఎం జీవీఎన్.శ్రీధర్ రాజు, మేనేజర్ వెంకటరమణ, అసిస్టెంట్ మేనేజర్ సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.