M Bala Krishna, Hyderabad, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో పొలిటికల్ తుఫాన్ ప్రారంభం కాబోతోందా..? గతంలో లేని విధంగా రెండు ప్రధాన వర్గాలు సీఎం జగన్ (AP CM YS Jagan) కు ఝలక్ ఇచ్చి బ్రదర్ అనిల్ వెంట నడవనున్నాయా..? ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇందుకు సంబంధించి కీలక చర్చలకు బ్రదర్ అనిల్ కుమార్ విజయవాడలో నిర్వహించిన సమావేశం ఆజ్యం పోసింది. దీంతో ఈ పొలిటికల్ తుఫాను ఎంత కాలం ఉంటుంది.. ఉండి ఏం సాధించనుంది అన్నది ఇప్పుడొక ప్రధాన చర్చగా మారింది. ఎందుకంటే ఇప్పటికే జనసేన, టీడీపీ లాంటి పార్టీలు మూకుమ్మడిగా బీజేపీని కలుపుకోకుండానే వైసీపీపై దాడి చేస్తున్నాయి.
అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఒంటరిపోరే చేస్తోంది. కొన్నిసార్లు టీడీపీ వైఖరికి కొన్ని నిరసనలకు జనసేన మద్దతు ఇస్తూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ కూడా మంచి ఫలితాలే ఇస్తాయని భావిస్తున్న తరుణంలో కొత్త పార్టీ గుసగుసలు మాత్రం జోరందుకోవడంతో జగన్ శిబిరంలో కాస్త కలవరం మొదలైంది. దీంతో ఎప్పుడు ఏం జరగనుందో అన్న ఆసక్తి నెలకొంది.
వాస్తవానికి గత ఏడాది జరిగిన వైఎస్సార్ 12వ వర్థంతి సందర్భంగా విజయమ్మ నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డ జగన్ ను ఆదరించిన విధంగానే కుమార్తె షర్మిలనూ ఆదరించాలని కోరారు. వాస్తవానికి ఆ రోజు ఉన్న పరిణామాల నేపథ్యంలో ఓ కొత్త పార్టీ ఆంధ్రాలో ప్రవేశ పెట్టనున్నారు అన్న సంకేతాలు కూడా వచ్చాయి. కానీ అవేవీ తరువాత కాలంలో పెద్దగా బలపడలేదు. వైఎస్ కుమార్తె షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టారు.
వైఎస్సార్టీపీ ఆరంభం తరువాత ఇటీవల ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తింపు ఇవ్వడంతో ఇక షర్మిల ప్రయత్నాలు మరింత ముమ్మరం అయ్యాయి. ఈ దశలో ఆంధ్రాలో కూడా పార్టీ పెట్టే అవకాశాలను తాను కొట్టిపారేయలేనని గతంలోనే చెప్పారు. దీంతో ఏ క్షణంలో అయిన షర్మిల ఏపీలో పార్టీ పెట్టబోతున్నారన్న సంకేతాలు వచ్చిన నేపథ్యంలో పరిణామాలు అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.
మరో వైపు కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో భాగంగానే బ్రదర్ అనిల్ ముఖ్యంగా జగన్ కు వ్యతిరేకంగా ఉన్న పాస్టర్స్, క్రెస్తవ మద్దతుదారులతో కలిసినట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా క్రితం రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లితో భేటీ వెనుక కూడా బ్రదర్ అనిల్ ప్రత్యేక పార్టీనే కారణమన్న ప్రచారం జరుగుతోంది.
గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలన్ని బ్రదర్ అనిల్ కుమార్ కొత్త పార్టీ పెట్టడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తాను పార్టీ పెట్టబోతున్నట్లు లీకులు వదిలి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్న బ్రదర్ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఐతే ఆయన పార్టీ పెడతారా.. లేక క్రైస్తవుల అభివృద్ధి పేరుతో ఏదైనా వేదిక ఏర్పాటు చేసి పోరాడతారా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics