SPECULATIONS OVER THIS EX MP FROM YSRCP IS THINKING TO JOIN THIS POLITICAL PARTY SOON FULL DETAILS HERE PRN
AP Politics: అధికార పార్టీని వీడనున్న మహిళా నేత.. ఆ పార్టీవైపుచూస్తున్నారా..? కానీ కండిషన్స్ అప్లై...
ప్రతీకాత్మకచిత్రం
AP Politics: ఏపీలో మాత్రం కొత్త పార్టీలోకి వెళ్తే చాలు.. పాతపార్టీపై దుమ్మెత్తిపోస్తుంటారు నేతలు. తీరా వెళ్లిన చోట గుర్తింపు రాకపోవడంతో మళ్లీ యూ టర్న్ తీసుకుంటారు. ఇప్పుడు ఓ మహిళా నేత అలాంటి నిర్ణయమే తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. ఈ రోజు ఓ పార్టీలో ఉన్నవాళ్లు.. రేపు మరో పార్టీలోకి మారిపోతుంటారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాదు ఏ రాష్ట్రంలో అయినా ఇది చాలా కామన్. కానీ ఏపీలో మాత్రం కొత్త పార్టీలోకి వెళ్తే చాలు.. పాత పార్టీపై దుమ్మెత్తిపోస్తుంటారు నేతలు. తీరా వెళ్లిన చోట గుర్తింపు రాకపోవడంతో మళ్లీ యూ టర్న్ తీసుకుంటారు. ఇప్పుడు ఓ మహిళా నేత అలాంటి నిర్ణయమే తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె కర్నూలు (Kurnool) మాజీ ఎంపీ బుట్టా రేణుక. రాష్ట్రవిభజన సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె వైసీపీ (YSRCP) లో చేరి కర్నూలు ఎంపీగా పోటీ చేశారు. వ్యాపారవేత్త కావడం, ఆర్ధికంగా బలమన్న నేత కావడంతో తొలి ప్రయత్నంలోనే ఆమె ఎంపీగా గెలిచారు. ఐతే ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో కొన్నాళ్ల తర్వాత పార్టీ మారారు. ఆమె టీడీపీ (TDP) తీర్థం పుచ్చుకోకపోయినా.. ఆమె భర్త శివనీలకంఠ పార్టీలో చేరారు. పార్లమెంట్ లో వైసీపీకి దూరంగా ఉన్న రేణుక.. టీడీపీకి అనుకూలంగా మెలిగారు.
ఐతే టీడీపీలో చేరిన బుట్టా రేణుక అనుకున్నదొకటి.. అయినది మరొకటి. 2019లో చంద్రబాబు ఆమెకు టికెట్ ఇవ్వలేదు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో రేణుక తిరిగి వైసీపీలో చేరిపోయారు. పార్టీ విజయం సాధించిన తర్వాత కనీసం ఎమ్మెల్సీ సీటు అయినా దక్కుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావోస్తున్నా ఆమెకు మాత్రం పదవిరాలేదు. భవిష్యత్తులో కూడా గ్యారెంటీ లేదు. దీంతో ఆమె వైసీపీలో కొనసాగడంపై పునరాలోచనలో పడ్డట్లు టాక్ వినిపిస్తోంది. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో చురుగ్గా పనిచేసిన ఆమె ఆ తర్వాత సైలెంట్ అయ్యారు.
ఈ నేపథ్యంలో పార్టీ మారలని బుట్టా రేణుక భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త ఇప్పటికే టీడీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయి. గతంలో కాకుండా ఈసారి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ పై పక్కాగా హామీ ఇస్తే సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇటు టీడీపీ కూడా కర్నూలో ఒకింత నాయత్వలేమిని ఎదుర్కొంటోంది. బుట్టా రేణుక వస్తే మంచి అభ్యర్ధితో పాటు స్థానికంగా పార్టీని నడిపించే హ్యాండ్ అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారట. ఆమెకు కర్నూలు ఎంపీ లేదా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే సీటు కేటాయించే సూచనలున్నాయని కూడా చెబుతున్నారు. మరి ఈ ప్రచారం నిజమో కాదో తెలియాలంటే బుట్టారేణుక అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.