ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు చెందిన నాలుగు రాజ్యసభ (Rajyasabha) స్థానాలు త్వరలో ఖాళీ అవబోతున్నాయి. నలుగురు ఏపీ ఎంపీలు త్వరలో రిటైర్ కాబోతున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీల ప్రకారం ఖాళీ అయ్యే స్థానాల్లో ఒకటి వైసీపీది కాగా.. రెండు టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లిన ఎంపీలవి, మరొకటి టీడీపీ సాయంతో నామినేట్ అయిన బీజేపీ ఎంపీది. వైసీపీ (YSRCP) నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, సాంకేతికంగా బీజేపీ ఎంపీలుగా కొనసాగుతన్న సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు రిటైర్ కాబోతున్నారు. రాష్ట్రం నుంచి ఈ నాలుగు ఎంపీ స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభకు వెళ్లే వైసీపీ నేతలవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వైసీపీ నుంచి విజయసాయి రెడ్డికి సీఎం జగన్ మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశముంది. పార్టీ లెక్కలు కూడా విజయసాయి రెడ్డితో పాటు ఎవరనేదానిపైనే ఉన్నాయి. మిగిలిన ముగ్గురి ఎంపికలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. విజయసాయి రెడ్డి రూపంలో రెడ్డి సామాజిక వర్గం కోటా ఫుల్ అయిపోతుండటంతో ఎస్సీ, బీసీ, మైనార్టీ లేదా కాపు నేతలను ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎవరు ఆ లక్కీ ఛాన్స్ దక్కించుకుంటారనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఆశావాహుల లిస్ట్ పెద్దదే..
గత ఎన్నికల ముందు సీఎం జగన్ కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వలేకపోయిన నేతలకు ఎమ్మెల్సీ, రాజ్యసభ హామీలిచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యే స్థానాలను భర్తీ చేయగా.. ఇప్పుడు రాజ్యసభ వంతు రాబోతోంది. పార్టీ నిర్ణయాలు, సామాజిక వర్గ సమీకరణానలను బేరీజు వేసుకుంటున్న పలుపురు నేతలు తమకు ఛాన్స్ రాదని ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. ఐతే కొందరు మాత్రం తమ స్థానం కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభపై ఆసక్తి ఉంది. సీఎం జగన్ ఒప్పుకోవాలేగానీ టీటీడీ పదవి వదిలేసి ఢిల్లీ వెళ్లేందుకు ఆయన ఎప్పుడూ సిద్ధమే. ఇక సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చిన వారిలో ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
సినిమా రంగం నుంచి కూడా పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రచారంలోకి వచ్చినా.. అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ముఖ్యంగా నటుడు మోహన్ బాబును రాజ్యసభకు పంపుతున్నట్లు ప్రచారం జరిగింది. ఆ పదవిపై ఆయనకు ఎప్పటినుంచో ఆసక్తి ఉంది. ఐతే మా ఎన్నికల తర్వాత పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబును జగన్ దూరంపెట్టారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇటీవల ఆయన విజయవాడ వచ్చినా సీఎం అపాయింట్ మెంట్ దొరకలేదని వార్తలు వచ్చాయి.
మోహన్ బాబుతో పాటు హాస్యనటుడు ఆలీ పేరు కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆలీకి అటు టాలీవుడ్ తో పాటు మైనార్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందనే ప్రచారమూ లేకపోలేదు. ఎమ్మెల్సీ స్థానల భర్తీ సమయంలోనూ ఆలీ పేరు వినిపించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా.. సీఎం జగన్ సూచనతో ఆలీ వెనక్కితగ్గారు. ఎంతమంది ట్రై చేసినా... ఎన్ని పేర్లు వినిపించినా పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సీనియర్ నేతలు కోరుతున్నారు. మరి సీఎం జగన్ మనసులో ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.!
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ysrcp