నారా లోకేష్ (Nara Lokesh). భవిష్యత్తులో టీడీపీ (TDP) రథసారథి. చంద్రబాబు (Chandra Babu Naidu) తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టినా.. ఆ పార్టీ సీఎం అభ్యర్థి అని చెప్పుకున్నా ఆయనే. ఐతే నాయకుడు గెలవాలంటే ఆయన ఒక్కడి వల్ల అయ్యేపని కాదు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలుపుకొని వెళ్లాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. చుట్టూ భజన పరులను పెట్టుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం మంగళగిరిలో లోకేష్ పరిస్థితి అలానే కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లంటున్నారు. లోకేష్ ఏర్పాటు చేసుకున్న టీమ్.. తిరిగి ఆయనకే శాపంలా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లోకేష్ బృందంలో ఒకరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం.. ఇన్నాళ్లూ అవి చంద్రబాబు దృష్టికిగానీ, లోకేష్ నోటీస్ కి గానీ రాకపోవడంతో లోకేష్ కు తెలియకుండా చాలా జరుగుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా అక్కడి నుంచి గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే వారంలో రెండుమూడు రోజులు అక్కడే మకాం వేస్తూ ఇంటింటికీ వెళ్తున్నారు. నాయకుడిగా గుర్తింపు తెచ్చుకునేందుకు తనకున్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు. అందుకే ఆయనకు సలహాలిచ్చేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితులు చెప్పేందుకు ఓ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన సందర్భంలోనూ ఆయన టీమ్ లోకేష్ కోసం పనిచేసింది.
ప్రస్తుతం లోకేష్ టీమ్ మంగళగిరిలో ఆయనకు మైనస్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన టీమ్ లో లోపాలు చెప్పేవారికంటే.. మీరు సూపర్ సర్ అని భజన చేసేవాళ్లే ఎక్కువైపోయారంట. వారి భజనకు పొంగిపోతున్న చినబాబు వాస్తవ పరిస్థితులను పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయి కార్యకర్తలు చెబుతున్నారు. లోకేష్ పీఏపై ఇటీవల వచ్చిన లైంగిక వేధింపులే ఇందుకు నిదర్శమంటున్నారు. ఒకవేళ ఇది వైసీపీ స్కెచ్ అని తప్పుకున్నా.. ఇంత జరుగుతున్నా అక్కడున్న టీమ్ ఎందుకు పసిగట్టలేకపోయిందనేది మరో ప్రశ్న. పోనీ వ్యక్తిగత సిబ్బందిపై వచ్చిన ఆరోపణలకు స్పందించడం లేదా.. సదరు వ్యక్తిని తొలగించడం కానీ చేయలేదు.
ప్రస్తుతం పార్టీ ఘోరమైన ఓటమిని ఎదుర్కొంటూ పూర్వవైభవాన్ని సంతరించుకోవాల్సిన సమయం.. అలాంటి సమయంలో మంగళగిరికే పరితమిం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా దృష్టిపెట్టాలి. పార్టీ ముఖ్యనేత అయినా.. ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నారు. అలాంటి సమయంలో గెలిచిన అరకొర ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితి తెలుసుకోవాలి కానీ.. అందరి దగ్గరా ఆయనకు చనువు లేదని తెలుస్తోంది. ఇక్కడ కూడా ఆయన టీమ్ పైనే అధారపడుతున్నారన్న విమర్శ ఉంది. అందుకే అప్పుడప్పుడు కొందరు సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరెత్తుతున్నారు. కొందరైతే పవన్ తో పొత్తుపెట్టుకోవాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Mangalagiri, Nara Lokesh, TDP