ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను (Village, Ward Secretariats) తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) తన మానసపుత్రికగా గ్రామ సచివాలయ వ్యవస్థను పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర పౌర సేవలు సులభంగా ప్రజలకు అందించేందుకు ప్రతి రెండు వేల మంది జనభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసిన సీఎం జగన్.. అదే ఏడాది అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షా 20వేల మందిని నియమించారు. వీరికి రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ అమలు చేసి ఆ తర్వాత ఉద్యోగాలను పర్మినెంట్ చేయడంతో పాటు జీతాలు కూడా పెంచుతామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.
ఐతే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తై దాదాపు 2నెలలు కావొస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులో వారందరికీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్ పూర్తి చేసినట్లు ధృవీకరించి ఉద్యోలాను పర్మినెంట్ చేస్తామని.. పరీక్షలో పాసవ్వనివారికి మరో అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఐతే అక్టోబర్ 2న ప్రొబేషన్ ముగిసినా ఇంతవరకూ ఉద్యోగాల పర్మినెంట్ చేయడానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభంకాలేదు. అక్టోబర్ 2 నాటికి 40వేల మంది, అక్టోబర్ 30నాటికి 30వేల మంది, నవంబర్ నెలాఖరుకు 50వేల మంది రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ పూర్తవుతుంది. ప్రస్తుతం వీరంతా జీతాల పెంపుకోసం ఎదురుచూస్తున్నారు. ఐతే ప్రభుత్వం తరపు నుంచి పరీక్ష నిర్వహణ తప్పితే మిగతా ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు.
కారణం ఇదేనా..!
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే వారికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం వారికి రూ.15వేలు జీతం ఇస్తుండగా.. అది రూ.22వేల నుంచి రూ.24 వేల వరకు పెంచాలి. అలాగే వారికి పీఎఫ్, సీపీఎస్, హెల్త్ కార్డులు, కారుణ్య నియామకాలు ఇలా అదనపు సౌకర్యాలు కూడా కల్పించాల్సి ఉంటుంది. దాదాపు లక్షా 20వేల మందికి ఇవన్నీ బెనిఫిట్స్ కల్పించాలంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిని బట్టి చూస్తే ఇది అదనపు భారమనే చెప్పాలి. అందుకే బడ్జెట్ వచ్చేఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేటాయింపులను బట్టి వీరందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద పాతవేతనాల వరకే బడ్జెట్ ఉంది. అందువల్లే ప్రొబేషన్ ఆలస్యమవుతోందన్న వాదన వినిపిస్తోంది. కొత్త బడ్జేట్ అమల్లోకి వచ్చి వీరి జీతాలకు కేటాయింపులు జరిగితే అప్పుడు అందరికీ ఒకేసారి జీతాలు పెంచవచ్చన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ వచ్చేవరకు ఎదురుచూపులు తప్పేలా లేవని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.