ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కొంతకాలంగా రాజ్యసభ స్థానాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ కోటాలో నలుగురు సభ్యులు త్వరలో రిటైర్ కానున్న నేపథ్యంలో ఆ నాలుగు స్థానాలు వైసీపీ (YSRCP) ఖాతాలోకే చేరనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి రాజ్యసభ ఛాన్స్ ఎవరికి వస్తుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాలుగు స్థానాల్లో ఒకటి ప్రస్తుతం ఎంపీగా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి దాదాపు ఖాయమైంది. దీంతో మిగిలిన మూడు స్థానాల కోసం ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హాస్యనటుడు ఆలీకి రాజ్యసభ సీటు దక్కుబతోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా సీఎం జగన్ (YS Jagan) నుంచి ఆలీకి హామీ కూడా దక్కినట్లు వార్తలు వస్తున్నాయి.
గురువారం సినీప్రముఖులు సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవి, ఆర్.నారాయణమూర్తి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురణీతో పాటు ఆలీ కూడా హాజరయ్యారు. ఐతే చిరంజీవి అండ్ టీమ్ రాకముందే అలీ తాడేపల్లికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్.. ఆలీకి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. మరో వారంలో కలుద్దామని సీఎం అలీతో చెప్పారని.. అది ఖచ్చితంగా రాజ్యసభ బెర్త్ గురించి మాట్లాడేందుకేనని ప్రచారం జరుగుతోంది.
వైసీపీ తరపు నుంచి భర్తీకానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి మైనార్టీలకు ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం, మండలి డిప్యూటీ ఛైర్మన్ వంటి కీలక పదవులిచ్చిన సీఎం.. ఎంపీ పదవి కూడా కట్టబెట్టాలని చూస్తున్నారట.. అందులో భాగంగానే ఆలీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వైసీపీకి దూరంగా ఉన్నా.. ఆలీ మాత్రం జగన్ కు జై కొట్టారు. అసెంబ్లీకి పోటీ చేయాలని భావించినా జగన్ సూచనతో విరమించుకున్నారు. ఐతే అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ తరపున ప్రచారం చేశారు.
రెండున్నరేళ్లుగా ఆయన పదవి కోసం ఎదరుచూస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ పదవిని ఆశించినట్లు ప్రచారం జరిగినా అదేమీ జరగలేదు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవడం అందులో ఒకటి మైనార్టీలకు ఇవ్వాలని సీఎం అనుకుంటుండటంతో ఆలీ పేరు ముందువరసలో ఉంది. ఐతే దీనిపై వైసీపీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందని పార్టీ వర్గాలంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Comedian ali, Ysrcp