Anna Raghu, Guntur, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రస్తుత ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ (AP CS Sameer Sharma) పదవీ కాలం త్వరలో ముగియనుంది. 1985 బ్యాచ్ కు చెందిన సమీర్ శర్మ ఈ ఏడాది జూలైలో కేంద్ర సర్వీసుల నుండి రిలీవ్ అయి రాష్ట్ర సర్వీసులోకి వచ్చారు. ఆయన సి.ఎస్ గా బాధ్యతలు స్వీకరించేనాటికి ఆయన సర్వీస్ కేవలం రెండునెలలు మాత్రమే మిగిలిఉంది. అక్టోబర్ నెలలో సి.ఎస్ గా బాధ్యతలు చేపట్టిన సమీర్ శర్మ నవంబర్ నెలాఖరుకు రిటైర్ అవ్వవలసి ఉంది. ఐతే సీఎం జగన్ (AP CM YS Jagan) అభీష్టం మేరకు ఆయన సర్వీసును ఆరు నెలలు పాటు రెండు ధఫాలుగా పొడిగించే వెసులుబాటు ఉంది.ఐతే సమీర్ శర్మ తర్వాత ఎవరిని ఛీఫ్ సెక్రటరీగా నియమించాలనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు సచివాలయ వర్గాల్లో చర్చ జరగుతోంది.
సాధారణంగా రాష్ట్రంలో ఉన్న సీనియర్ I.A.S అధికారిని ఛీఫ్ సెక్రటరీగా నియమించడం ఆనవాయితీ. ఐతే రాజకీయ కారణాల వలన కొన్ని కొన్ని సందర్భాలలో సీనియారిటీని ప్రక్కన బెట్టి తమకు అనుకులమైన అధికారిని సీ.ఎస్ పదవిలో కూర్చో బెట్టడం ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయింది. ఆ మాటకు వస్తే గతంలో సి.ఎస్ గా వ్యవహరించిన ఆదిత్యనాధ్ దాస్ (1987 బ్యాచ్ ) ప్రస్తుత సి.ఎస్ సమీర్ శర్మ (1985 బ్యాచ్ )కు రెండేళ్ళు జూనియర్.
ఐతే ప్రస్తుత సీ.ఎస్ పదవీకాలం మరో ఆరునెలలు పొడిగిస్తే సీనియారిటీ ప్రకారం తదుపరి సీ.ఎస్ రేసులో ఉన్న నలుగురు అధికారులు ఏడాది లోపే రిటైరవ్వాల్సి ఉంది. వారిలో ముఖ్యంగా ప్రస్తుతం డెప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న అజయ్ సాహ్నీ (మాజీ ఛీఫ్ సెక్రటరీ నీలం సాహ్నీ భర్త), సామాజికన్యాయం & పేదరిక నిర్మూలన మరియు ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ సీ.యం ప్రిన్సిపల్ సెక్రటరీ గా వ్యవహరించిన సతీష్ చంద్రవంటి వారికి అవకాశాలు సన్నగిల్లినట్లే.
అదే జరిగితే 1988 బ్యాచ్ కు చెందిన మరో సీనియర్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి ఆ అవకాశం దక్కవచ్చని ఐ.ఏ.ఎస్ వర్గాలలో చర్చ జరగుతోంది. తెలంగాణ కేడర్ కు చెందిన శ్రీలక్ష్మి ఇటీవలే ఏపీ కేడర్ కు వచ్చారు. వచ్చీ రావడంతోనే ప్రిన్సిపల్ సెక్రటరీ హాదా పొంది రెండు నెలలు తిరక్కుండానే ఆమెకు స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ గా ప్రమోషన్ కల్పించడంపై అప్పట్లో ఐ.ఏ.ఎస్ వర్గాలలో పెద్ద చర్చే నడిచింది. ఓబులాపురం మైనింగ్ కేసులో మరియు జగన్ కేసులలో సహ నిందితురాలిగా జైలుకు కూడా వెళ్ళి వచ్చిన శ్రీలక్ష్మి కి జగన్ మేలు చేశారని, తదుపరి సీ.ఎస్ శ్రీలక్ష్మి అయ్యే అవకాశముందంటున్నారు. అందుకే పట్టుబట్టి మరీ ఆమె తెలంగాణ కేడర్ నుండి ఆంధ్ర కేడర్ కు మారారనే ప్రచారమూ జరిగింది. సీ.ఎస్ గా శ్రీలక్ష్మి నియిమకంపై న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయేమో అనే అనుమానాలు అటు శ్రీలక్ష్మి తోపటు ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.
శ్రీలక్ష్మిని సీ.ఎస్ గా నియమించడం సాధ్యం కాని పక్షంలో మరో సీనియర్ అధికారిణి, ముక్కుసూటి మనిషిగా పేరున్న పూనం.మాలకొండయ్యకు సీఎస్ గా బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదంతా సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు టాక్. వ్యవసాయ శాఖ కమిషనర్ గా ఉన్నప్పుడు మోనోశాంటే వంటి మల్టీనేషనల్ కంపెనీకి పూనం మాలకొండయ్య చుక్కలు చూపించారు. ఆమెను సీఎస్ గా నియమిస్తే అవినీతిపై ఉక్కుపాదం మోపుతారని భావించి సీఎం జగన్ పూనం మాలకొండయ్య వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government