2019 అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections-2019) ఘోర పరాజయం తర్వాత ప్రతిపక్ష టీడీపీ (TDP) కి ఎదీ కలిసిరావడం లేదు. పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లా (Krishna District) లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైనా.. ఒక్క ఎమ్మెల్యే మాత్రమే మిగిలారు. దీంతో ఈ జిల్లాలో పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) ని ఓడించాల్సిన అవసరం ఆ పార్టీకి ఏర్పడిందనే చెప్పాలి. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గంలో రెండుసార్లు టీడీపీ తరపున, మరో రెండుసార్లు వైసీపీ తరపున గెలిచారు కొడాలి నాని. ఐతే 2019లో వైసీపీ అధికారంలోకి రావడం టీడీపీ మునుపెన్నడూలేనంత ఘోరంగా ఓడిపోవడం, కొడాలి నానికి మంత్రిపదవి దక్కడంతో ఆయన విమర్శల ధాటికి టీడీపీ సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఇక రాష్ట్రంలో ఏ అంశం తెరపైకి వచ్చినా.. టీడీపీ విమర్శలు చేసినా.. కొడాలి నాని తనదైన శైలిలో చంద్రబాబు, లోకేష్ తో పాటు టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇటీవల క్యాసినో వ్యవహారం తర్వాత విమర్శలు తీవ్రరూపం దాల్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గుడివాడలో కొడాలి నానీకి గట్టిపోటీనిచ్చే నేతలు నిలబెట్టాలని టీడీపీ భావిస్తోంది. ఏ రకంగా చూసినా కృష్ణాజిల్లాలో కొడాలి నానిని ఢీ కొట్ట నేతలు టీడీపీకి లేరు. స్థానిక నేతలున్నా ఆయనకు పోటీనిచ్చే బలం వారికి లేదు. దీంతో ఎన్టీఆర్ కుటుంబాన్ని అభిమానించే కొడాలి నానిపై నందమూరి ఫ్యామిలీ నుంచే ఎవరో ఒకర్ని బరిలో దించితే సరిపోతుందన్న భావనను తెలుగు తమ్ముళ్లు వ్యక్తపరుస్తున్నారు.
ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరు బాగా వినిపిస్తోంది. కొడాలి నాని ఓడించాలంటే బాలయ్యే కరెక్ట్ అని తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ నటవారసుడగా సినిమాల్లో సత్తా చాటినట్లే.. ఆయన స్వస్థలంలోనూ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టాలని కోరుతున్నారట. ఐతే వరుసగా రెండుసార్లు హిందూపురంలో బాలకృష్ణ గెలుపొందారు. 2019లో రాష్ట్రమంతా వైసీపీ వేవ్ ఉన్నా.. బాలకృష్ణ మాత్రం నిలబట్టారు. తనను రెండుసార్లు గెలిచిన నియోజకవర్గాన్ని వదిలి వస్తారా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
బాలకృష్ణ గుడివాడ వచ్చేందుకు నిరాకరిస్తే నందమూరి కుటుంబంలో ఎవరోఒకర్ని బరిలో దించాలని టీడీపీ నేతలు కోరుతున్నట్లు టాక్. త్వరలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు కూడా జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలకు నందమూరి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ హాజరువుతున్నారు. ఈ వేడుకల వేదికగానే ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకర్ని చంద్రబాబు ఒప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. మహానాడు నాటికి దీనిపై క్లారిటీకి వచ్చి బరిలో దించుతారని సమాచారం. మరి గుడివాడ విషయంలో చంద్రబాబు ఎవర్ని బరిలో దించుతారు..? బాలయ్య ఒప్పుకుంటాడా..? లేక నందమూరి కుటుంబం నుంచి ఎవర్నైనా బాబు ఒప్పిస్తారా..? అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Gudivada, Kodali Nani