దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న దుర్గగుడి... ఈసారి ప్రత్యేకతలు ఇవీ...

Dussehra 2019 : అక్టోబర్ 8 మంగళవారం నాడు దసరా పండుగ జరుపుకోబోతున్నాం. ఈ ఏడాది ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో... ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్ల విషయంలో అధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 6, 2019, 12:36 PM IST
దసరా ఉత్సవాలకు సిద్ధమవుతున్న దుర్గగుడి... ఈసారి ప్రత్యేకతలు ఇవీ...
విజయవాడ కనకదుర్మమ్మ (File)
  • Share this:
బెజవాడ కనక దుర్గమ్మ సన్నిధిలో ఈ ఏడాది దసరా ఉత్సవాలు... సెప్టెంబర్ 29న మొదలై... అక్టోబర్ 8న దసరా పండుగ రోజు వరకూ జరుగుతాయి. ఇందుకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చెయ్యాలనే అంశంపై అధికారులతో దుర్గ గుడి ఈవో సురేష్ బాబు చర్చించారు. ప్రతీ సంవత్సరంలాగానే... క్యూ లైన్లు రథం సెంటర్ దగ్గరున్న వినాయక స్వామి గుడి నుంచీ ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఉచితంగా మజ్జిగ... మంచినీరు ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. ఇంద్రకీలాద్రి కింద నుంచీ దుర్గ గుడిని చేరేందుకు... తొమ్మిది బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. దాతలు కోరుకుంటే వారి పేరు మీద ఒక రోజు బస్సు ట్రిప్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక అమ్మవారి పుష్ప అలంకరణ కోసం రోజుకు రూ.1.50 లక్షల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.

భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీ జరుగుతుందన్న ఈవో సురేష్ బాబు.. ఏదైనా ఓ అనాథ ఆశ్రమంలో ఉండే వారి కోసం రెండు లేదా మూడో రోజున ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తామన్నారు. ఈసారి అమ్మవారి ఊరేగింపు ముందు చతురంగ బలాల కవాతు ఉంటుందని వివరించారు. దసరా ఉత్సవాల్లో 20 లక్షల లడ్డూలు... 16 లక్షల పులిహోర ప్యాకెట్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అప్పాల ప్రసాదం పెంచాలనుకుంటున్నా... ఎండోమెంట్ కమిషనర్ నుంచీ అనుమతి రావాల్సి ఉంది.

దసరా ఉత్సవాల కోసం మూడేళ్లుగా ప్రభుత్వం నుంచీ ఎలాంటి నిధులూ రావట్లేదన్న ఈవో... రాష్ట్ర పండుగగా ప్రకటించారు కాబట్టి... సీఎం జగన్ ఈసారి ప్రత్యేక నిధులు ఇస్తారని ఆశిస్తున్నామన్నారు ఈవో సురేష్ బాబు,. గతేడాది దసరా ఉత్సవాల కోసం రూ.6.87 కోట్ల ఖర్చు అయ్యిందన్న ఆయన... ఈసారి ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈ ఉత్సవాల కోసం మొత్తం 12 లక్షల నుంచీ 13 లక్షల మంది దాకా భక్తులు వస్తారనే అంచనా ఉంది. ముఖ్యంగా మూల నక్షత్రం.. దసరా.. విజయదశమి రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా... తగిన జాగ్రత్తల కోసం... శనివారం కలెక్టర్ అధ్వర్యంలో దసరా ఉత్సవాల కోసం అన్ని శాఖలతో సమన్వయ సమావేశం జరగనుంది.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు