హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రైళ్ల మంచు కష్టాలకు చెక్.. లోకో పైలట్లకు కొత్త టెక్నాలజీ

రైళ్ల మంచు కష్టాలకు చెక్.. లోకో పైలట్లకు కొత్త టెక్నాలజీ

రైళ్లలో ఫాగ్ పాస్ పరికరాలు

రైళ్లలో ఫాగ్ పాస్ పరికరాలు

చలికాలంలో రైళ్ల రాకపోకల్లో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెచ్చింది.

(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ కరెస్పాండెంట్)

చలికాలం వస్తుందంటే చాలు రైళ్లను నడిపే లోకో పైలట్లకు కత్తి మీద సామే. మంచుతెరల మధ్య సిగ్నళ్లను సక్రమంగా అనుసరిస్తూ రైళ్లను నడపాలంటే చుక్కలు కనిపిస్తుంటాయి. దీంతో రైళ్ల వేగం తగ్గడంతో పాటు సమయపాలన కూడా కష్టమవుతుంటుంది. ఒక్కోసారి రైళ్ల దారి మళ్లింపులు, స్టేషన్లలో నిలిపివేతలు కూడా తప్పని పరిస్ధితులు ఉంటాయి. వీటిని ఎదుర్కొనేందుకు డిజిటల్ టెక్నాలజీతో పనిచేసే జీపీఎస్ ఆథారిత ఫాగ్ పాస్ డివైజ్ లను దక్షిణ మధ్య రైల్వే లోకోపైలట్లకు అందిస్తోంది. వీటి వినియోగంతో ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తోందని అధికారులు చెప్తున్నారు.

చలికాలంలో రైళ్ల రాకపోకల్లో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే మరో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెచ్చింది. ముఖ్యంగా వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతూ నిరంతరం రైళ్లను నడిపే లోకో పైలట్లకు మంచు కారణంగా తలెత్తే ఇబ్బందుల నుంచి విముక్తి కలిగిస్తూ జీపీఎస్ ఆథారిత ఫాగ్ పాస్ డివైజ్ లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఎలాంటి మంచు పరిస్ధితుల్లో అయినా వీటిని వినియోగించేందుకు వీలుంది. ఇంజన్లో డ్రైవింగ్ చేసేటప్పుడు లోకోపైలట్లు తమ ముందు వీటిని పెట్టుకుంటే చాలు రైల్ ట్రాక్ పూర్తిగా స్పష్టంగా కనిపించడంతో పాటు బయటి శబ్దాలు కూడా వినిపించేలా వీటిని రూపొందించారు. రైల్వే ట్రాక్ తో పాటు సిగ్నళ్లు, స్టేషన్లు, లెవల్ క్రాసింగ్ లు , హెచ్చరిక బోర్డులు, మలుపులు, వాలులు కూడా వీటితో అనుసంధానమైన గూగుల్ మ్యాప్ ల ద్వారా స్పష్టంగా తెలుస్తాయి. ఫాగ్ పాస్ డివైజ్ ద్వారా లోకో పైలట్ రాబోయే మూడు స్టేషన్లను దూరంతో సహా తెలుసుకునే వీలుంది. అంతేగాక 500 మీటర్ల దూరం నుంచే లోకో పైలట్లకు అలర్ట్ లు కూడా అందిస్తాయి.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, విజయవాడ డివిజన్లలో ప్రయాణించే రైళ్లలో తొలి విడతగా 250 ఫాగ్ పాస్ డివైజ్ లను లోకో పైలట్లకు అందించారు. ఈ రెండు డివిజన్లలోనూ క్రూ బుకింగ్ కేంద్రాల వద్ద లోకో పైలట్లు వీటిని తీసుకుని తమ ప్రయాణం ఆరంభించేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ ఫాగ్ పాస్ డివైజ్ లు సులువుగా తీసుకెళ్లడానికి అనువుగా ఉండి లోకో పైలట్లకు కచ్చితమైన మార్గదర్శనం చేస్తున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా తెలిపారు. త్వరలో జోన్ లోని మిగిలిన డివిజన్లలోనూ లోకో పైలట్లకు ఈ డివైజ్ లను అందుబాటులోకి తెస్తామన్నారు.

First published:

Tags: South Central Railways, Train

ఉత్తమ కథలు