Sonusood: మరీ ఇంత మంచోడివేంటి సోనూసూద్... ఉదయం సోనూసూద్ వాట్సాప్‌కు మెసేజ్ పంపారో, లేదో.. సాయంత్రానికి..

సోనూసూద్ పంపిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్

చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన ధనుంజయులు అనే వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. ఆయనకు ఆక్సిజన్ అవసరమైంది. దీంతో.. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ కావాలంటూ సోనూసూద్‌కు వాట్సాప్ సందేశం పంపారు.

 • Share this:
  ‘స్వార్థంతో పరుగులు తీసే సమాజం.. ఎవరి కోసం ఆగదు’ అని కేజీఎఫ్ సినిమాలోని ఓ సన్నివేశంలో హీరో చెప్పే డైలాగ్‌ చాలామందికి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుత సమాజంలో పరిస్థితులు అచ్చం అలానే ఉన్నాయనడంలో సందేహం లేదు. మనుషుల్లో ‘నా.. నేను’ అనే థోరణి రోజురోజుకూ పెరిగిపోతున్న ఈరోజుల్లో తోటి వారి కోసం ఒక్కడు కదిలాడు. సాటి వారు కష్టాల్లో ఉంటే నేనున్నాననే భరోసాను కల్పించాడు. కలియుగ కర్ణుడిగా ఘన కీర్తి పొందాడు. కరోనా కష్టకాలంలో వలస కార్మికులను సొంత డబ్బుతో బస్సులు ఏర్పాటు చేసి మరీ స్వస్థలాలకు పంపడం అతనికే చెల్లింది. కూతుర్లను కాడెద్దులుగా చేసి పొలం దున్నుతున్న ఓ కష్టజీవి అయిన రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి ఆ అన్నదాతకు ఆసరాగా నిలిచి ఆదర్శంగా నిలిచిన గొప్ప మనసు అతనిది. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించి హీరోల చేతుల్లో దెబ్బలు తినే ఈ నటుడు నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకుని రీల్ హీరోలకు ఆదర్శంగా నిలిచాడు. మీడియాలో, సోషల్ మీడియాలో ఇప్పుడు అతనో సెలబ్రెటీ. అతనికే దక్కింది ఎవరికీ దక్కని పాపులారిటీ. కరోనా ఫస్ట్ వేవ్‌లో మాత్రమే కాదు సెకండ్ వేవ్‌లోనూ దేశ ప్రజల బాగోగుల కోసం అతను చూపించిన చొరవ నిజంగా ప్రశంనీయం. ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న తరుణంలో సొంత డబ్బుతో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాడు. రాజకీయ నేతలు, క్రికెటర్లు కూడా అతని సాయం కోసం చేయి చాచిన వారిలో ఉన్నారంటే ఎంతలా అతను అందరి దృష్టిని ఆకర్షించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ‘బతుకు జీవుడా’ అని ఎదురుచూస్తున్న చాలామందికి ప్రాణవాయువును అందించి వారి ప్రాణాలను నిలిపాడు. ఆ ఒకేఒక్కడు ఎవరో, కలియుగ కర్ణుడు ఎవరో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆ దానవీరశూర కర్ణుడే నటుడు సోనూసూద్. తాజాగా.. సోనూసూద్ మరోసారి తన దయా గుణాన్ని చాటుకున్నాడు. చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్నపర్తికుంట గ్రామానికి చెందిన ధనుంజయులు అనే వ్యక్తి కరోనా బారిన పడ్డాడు. ఆయనకు ఆక్సిజన్ అవసరమైంది. దీంతో.. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ కావాలంటూ సోనూసూద్‌కు వాట్సాప్ సందేశం పంపారు. ఆ సందేశం పంపిన ఎనిమిది గంటల్లోనే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను ఆ కరోనా బాధితుడికి పంపి పిలిస్తే పలుకుతాడని సోనూసూద్ మరోసారి నిరూపించుకున్నాడు.

  ఇది కూడా చదవండి: Mercy Killing: ఎంతటి విషాదం.. కొడుకును అలా చూడలేక అతని కారుణ్య మరణానికి అనుమతి కోరేందుకు వెళితే..

  కరోనా బారిన పడిన ధనుంజయులు అనే వ్యక్తికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ కావాలంటూ సోనూసూద్‌కు కుప్పం యువ కళాకారుడు పురుషోత్తం వాట్సాప్ సందేశం పంపారు. ఉదయం మెసేజ్ పంపగా, సాయంత్రానికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను సోనూసూద్ పంపారు. గతంలో సోనూసూద్ చిత్రాలు గీసి, ఆయన నుంచి పురుషోత్తం ప్రశంసలు అందుకున్నాడు. ఏదేమైనా సోనూసూద్ పెద్ద మనసుకు మరోసారి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోనూసూద్‌ను ప్రశంసిస్తూ లైక్స్, కామెంట్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.
  Published by:Sambasiva Reddy
  First published: