ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జిల్లాల నోటిఫికేషన్ (AP New Districts) పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు కూడా దీనిపై స్పందిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూనే ప్రభుత్వానికి కొన్ని సూచనలు సలహాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త జిల్లాలపై స్పందించారు. కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు వీర్రాజు పేర్కొనారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. కొత్త జిల్లాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల ఏర్పాటులో ఉన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సోము సూచించారు. జిల్లా కేంద్రం ఆయా జిల్లాలకు మధ్యలో ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే జిల్లాల పేర్లు విషయం అనేక అభ్యర్ధనలు ఉన్నాయని... వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.
జిల్లాలపై మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నానన్న ముద్రగడ.. ఓ అంశంపై కాస్త మనసు పెట్టాలని పేర్కొన్నారు. తూర్పు లేదా పశ్చిమగోదావరి జిల్లాకు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పేరు, ఏదో ఒక జిల్లాకు కృష్ణదేవరాయలు పేరు, కోనసీమ జిల్లాకు దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
కొత్త జిల్లా విషయంలో రాజకీయ పార్టీలు, ఆయా ప్రాంతాల ప్రజలు కూడా స్పందిస్తున్నారు. పేర్లు, నియోజకవర్గాల్లోని మండలాల విషయంలోనూ పలు సూచనలు చేస్తున్నారు. అలాగే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపైనా చర్చ జరుగుతోంది. అలాగే విజయవాడకు సమీపంగా ఉండే నూజివీడును ఏలూరులో కలపడంపైనా అభ్యంతరాలు వ్యక్తవుతున్నారు. విజయవాడకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉండే నూజివీడు.. లోక్ సభ నియోజకవర్గం ఆధారంగా ఏలూరులో కలపడం సరికాదని స్థానికులు చెబుతున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాపేరును శ్రీశైలంగా మారిస్తే బావుటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే తిరుపతికి శ్రీబాలాజీ జిల్లాగా, రాజంపేటను అన్నమయ్య జిల్లాగా, అరకును అల్లూరి సీతారామరాజు జిల్లాగా, పార్వతీపురంను మన్యం జిల్లాగా నామకరణం చేయడాన్ని ఆయా ప్రాంతాల వారీగా ప్రజలు స్వాగతిస్తున్నారు. ఐతే కొత్త జిల్లాలపై అభ్యంతరాలు, సూచనలకు ప్రభుత్వం నెలరోజులు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెలరోజుల్లోగా ఇంకెన్ని అభ్యంతరాలు, సూచనలు వస్తాయో వేచి చూడాలి. ఐతే ప్రభుత్వం ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts, Mudragada Padmanabham, Somu veerraju