ఓటుకు నోటు అనేది ఎన్నికలు జరిగినప్పుడల్లా కనిపించే తంతే. ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయల నల్లధనాన్ని ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థులు ఖర్చు పెట్టారు. ఐతే... ఇందులో ఎక్కువ మొత్తం ఓటర్లకు నోట్ల రూపంలో ఇచ్చేందుకు ఖర్చు పెట్టినదే. అదే సమయంలో... ఈ డబ్బు చాలా మంది ఓటర్లకు చేరలేదు. నిజానికి ఇలా డబ్బు తీసుకొని ఓటు వెయ్యడం నేరమే. కానీ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అభ్యర్థులు డబ్బులు ఇవ్వడం, ఓటర్లు డబ్బులు తీసుకొని ఓట్లు వెయ్యడం అనధికారికంగా జరుగుతోంది. ఈసారి మాత్రం చాలా మంది అభ్యర్థులు, వారి నియోజకవర్గాల ఏజెంట్లూ ఓటర్లకు డబ్బులు ఇవ్వలేదని తెలుస్తోంది. డబ్బుల బదులు ఓటర్లతో మనీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇలా డీల్ కుదుర్చుకున్న వారిలో ఎక్కువ మంది టీడీపీ, వైసీపీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులే ఉన్నట్లు సమాచారం.
మనీ డీల్ అంటే :ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రతీ ఓటర్కీ ఓటుకు రూ.2 వేల నుంచీ రూ.7 వేల దాకా ఇచ్చేందుకు అభ్యర్థులు సిద్ధపడ్డారు. ఐతే చాలా మంది అభ్యర్థులు డబ్బులు ఇవ్వలేదు. వాటి బదులు రూ.10, రూ.20 నోట్లను ఇచ్చారు. ఇలా ఇచ్చిన నోటుపై ఉండే 6 అంకెల సిరీస్ నెంబర్ను, ఓటర్ పేరునూ ప్రత్యేక పుస్తకాల్లో రాసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక సదరు అభ్యర్థి గెలిస్తే, ఆ రూ.10, రూ.20 నోట్లు ఇచ్చిన వారికి ముందుగా చెప్పినట్లే డీల్ ప్రకారం డబ్బు ఇస్తారన్నమాట. అదే అభ్యర్థి ఓడితే డబ్బులు ఇవ్వరు. ఇదో చట్ట వ్యతిరేక డీల్.
ఇలాంటి డీల్ వల్ల అభ్యర్థులకు రెండు లాభాలున్నాయి. 1. చిన్న నోట్లు తీసుకున్న ఓటర్లు కచ్చితంగా తమకే ఓటు వేస్తారనీ, డబ్బు కోసమైనా తమను గెలిపిస్తారని భావిస్తున్నారు. 2. ఒకవేళ అభ్యర్థి ఓడిపోతే డబ్బులు పోయాయే అనే బాధ ఓడిన అభ్యర్థికి ఉండదు. అందుకే ఈసారి ఎక్కువ మంది క్యాండిడేట్లు ఇలాంటి డీల్స్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.
ఓటర్ల ఎదురుచూపులు :మే 23 ఎప్పుడొస్తుందా, ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారా అని చిన్న నోట్లు తీసుకున్న ఓటర్లు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి ఓటర్లలో ఎక్కువమంది మహిళలు, రైతులు, ముసలివాళ్లూ ఉన్నారు. వీళ్లంతా రోజువారీ ఖర్చుల కోసం చిన్నా చితకా అప్పులు చేసినవాళ్లే. ఎన్నికల ఫలితాలు వస్తే, తాము డీల్ కుదుర్చుకున్న అభ్యర్థి గెలిస్తే, ఆ అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్ ద్వారా పెద్ద నోట్లు పొంద వచ్చని ఆశగా చూస్తున్నారు. కోట్ల మంది ఓటర్లు.
గెలిచినా ఎమ్మెల్యేలు డబ్బులు ఎగ్గొడతారా? : ఇదే ఇప్పుడు చిన్న నోట్లు తీసుకున్న ఓటర్లను కలవరపరుస్తున్న అంశం. డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చి, చిన్న నోట్లు చేతిలో పెట్టిన అభ్యర్థులు గెలిచిన తర్వాత మాట దాటేస్తారనీ, డబ్బులు ఎగ్గొట్టేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు మూడు కారణాలు కనిపిస్తున్నాయి. 1. అభ్యర్థి గెలిచి... అతని పార్టీ ఓడితే... పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి హైకమాండ్ తనకు మనీ ఇవ్వలేదని వంకలు పెట్టే అవకాశాలున్నాయి. 2. గెలిచిన అభ్యర్థి తాను ఎలాంటి డీలూ కుదుర్చుకోలేదనీ, అంతా ప్రత్యర్థుల కుట్ర అని చెప్పే పరిస్థితి ఉంది. తద్వారా నల్లధనాన్ని బయటకు తియ్యకుండా తప్పించుకునే ఛాన్సుంది. 3. ఓటర్లు కూడా డబ్బులు ఇమ్మని ఏజెంట్లను గట్టిగా అడగలేరు. ఎందుకంటే ఇలాంటి డీల్ కుదుర్చుకోవడం చట్ట రీత్యా నేరం. అందువల్ల గట్టిగా అడిగితే ఎక్కడ తమను పోలీసులు జైల్లో పెడతారోనన్న ఆందోళనలో ఉన్నారట ఆ డీల్ కుదుర్చుకున్న ఓటర్లు.
ప్రజాస్వామ్యంలో పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న అభ్యర్థులు వేసిన అత్యంత కుట్రపూరితమైన ఎన్నికల ఎత్తుగడ ఇది. అందుకే ఎన్నికల సమయంలోనే అధికారులు పదే పదే చెప్పారు. ఓటుకు నోట్లు వెయ్యవద్దనీ. డబ్బు తీసుకొని ఓట్లు వెయ్యడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని. కానీ పేద ప్రజలు కొంతైనా తమ అప్పుల కష్టాలు తీరుతాయన్న ఉద్దేశంతో ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకొని మోసపోతున్నారు. ఈసారి ఎన్నికల ఫలితాలు వచ్చాక ఏం జరుగుతుందో అన్నదే వారి మరో సమస్య.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.