కృష్ణాజిల్లాలో పెరిగిపోతున్న పాముకాట్లు... చేతులెత్తేస్తున్న ప్రభుత్వం..

వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులు, ఇతరత్రా పనుల కోసం రోడ్లపై తిరిగే జనం సైతం పాముల బారిన పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో పాముల బారిన పడిన వారి సంఖ్య 1400కు పైమాటే.

news18-telugu
Updated: August 14, 2019, 10:06 AM IST
కృష్ణాజిల్లాలో పెరిగిపోతున్న పాముకాట్లు... చేతులెత్తేస్తున్న ప్రభుత్వం..
నమూనా చిత్రం
  • Share this:
ఏపీలో ఎక్కడా లేని విధంగా కృష్ణాజిల్లాలో పాము కాట్లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు 1400 మందిని పాములు కరిచినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ముఖ్యంగా దివిసీమ ప్రాంతంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచీ పాముకాట్లు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో రైతులు, రైతు కూలీలు పొలాల వైపు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వం మాత్రం బాధితులకు మందులు అందుబాటులో ఉంచామని చెబుతోంది.
ఏపీలో తీర ప్రాంతం వెంట ఉండే పట్టణాలు, గ్రామాల్లో పాముల బెడద ఉంటుంది. అక్కడి సముద్ర తీరం నుంచి గ్రామాల్లోకి వివిధ రకాల పాములు ప్రవేశిస్తుంటాయి. కృష్ణాజిల్లాలో కొన్నేళ్లుగా వీటి ప్రభావం మరికాస్త ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా విభిన్న భౌగోళిక స్వరూపం కలిగిన దివిసీమ ప్రాంతంలో పాముకాట్ల ప్రభావం అధికంగా ఉంది. కృష్ణానదీ కాలవలు ఎక్కువగా ఉండటం, నదీ ముఖ ద్వారానికి సమీపంలో ఉండటం, ఇక్కడి నేలల స్వరూపం వంటి పలు అంశాలు ఇక్కడ పాములు పాగా వేయడానికి కారణమవుతున్నాయి. దీంతో ఏటా వందల సంఖ్యలో జనం పాము కాట్లకు గురవుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులు, ఇతరత్రా పనుల కోసం రోడ్లపై తిరిగే జనం సైతం పాముల బారిన పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో పాముల బారిన పడిన వారి సంఖ్య 1400కు పైమాటే.

పాముకాట్లు ఇంత భారీ స్ధాయిలో ఉన్నా... ప్రభుత్వం స్పందిస్తున్న తీరు భరోసా నింపేలా ఉండడం లేదనేది జిల్లా వాసుల ప్రధాన ఫిర్యాదు. పాము కాట్లకు గురైన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి తగిన చికిత్స అందించడం, పాముకాట్లకు విరుగుడు మందులను ప్రభుత్వాసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీల్లో అందుబాటులో ఉంచడం ప్రభుత్వ బాధ్యత. అక్కడే అధికారులు విఫలమవుతున్నారు. ఏడాది క్రితం వరకూ పాముకాట్ల బాధితులకు ప్రభుత్వాసుపత్రుల్లో సరైన మందులు అందుబాటులో ఉండేవి కావు. వరుస ఫిర్యాదులు, మీడియా జోక్యం కారణంగా అధికారుల్లో కాస్త చలనం వచ్చింది. ఇప్పటికీ పలుచోట్ల మందుల లభ్యత అంతంతమాత్రంగానే ఉంటోంది.
పాముకాటు తర్వాత చికిత్స చేయడం ఓ ఎత్తయితే రాకెట్ యుగంలోనూ పాము కాట్లను నివారించలేమా అన్నది మరో ప్రశ్న. దీనికి మాత్రం సమాధానం అంత సులువుగా లభించడం లేదు.

తీర ప్రాంత గ్రామాల్లో పాముల బెడద ఉందనుకున్నా.. నందిగామతో పాటు జిల్లాలోని పలు మెట్ట ప్రాంత పట్టణాలు, గ్రామాల్లోనూ పాముకాట్ల తీవ్రత అధికంగా ఉండటాన్ని అధికారులు సమర్ధించుకోలేని పరిస్ధితి. పగటి పూట సైతం రైతులు తమ పొలాల్లోకి ధైర్యంగా వెళ్లలేకపోతున్నారంటే పరిస్ధితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. అయినా సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రయత్నించకపోవడంపై స్ధానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేవలం పాములు పట్టేవాళ్లను అందుబాటులో ఉంచడమో, లేక మరో తాత్కాలిక పరిష్కారం కోసమో ఇప్పివరకూ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పాముల గమనంపై సమగ్ర అధ్యయనం జరిపించి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికైనా కృషి చేయాలని బాధితులు కోరుతున్నారు.
First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading