వాతావరణం మారింది.. రుతువులు మారాయి.. ఎండాకాలంలో భగభగ మండిన సూర్యుడిని కొన్ని రోజులు హాలిడేస్ తీసుకోమని వానదేవుడు డ్యూటీ ఎక్కేశాడు. వానలు పడుతున్నాయని రైతన్నలు సంతోషించినా.., ఇప్పుడే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షాకాంలో పాములు ఎక్కడంటే అక్కడ ఉంటాయి.ముఖ్యంగా పల్లెటూర్లలోని పంటపొలాల్లో, అటవీ ప్రాంతంలోని సరిహద్దు గ్రామాల్లో, దట్టంగా అల్లుకున్న పొదల దగ్గర పాములు తరచూ సంచరిస్తూ ఉంటాయి. అయితే ఇదే రైతులు పంటలు వేసేసమయం.., పొలాలకు నీరుపెట్టేందుకు వ్యవసాయ పనులకు పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు వెళ్తుంటారు. ఈ సమయంలో అప్రమత్తంగా లేకపోతే పాముల రూపంలో మృత్యువు కాచుకుని ఉండొచ్చు. వర్షాకాలం మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పలు ప్రాంతాల్లో పాముకాటు బాధితులు పెరిగిపోతున్నారు. వర్షాకాలంలో బురద ఎక్కువగా ఉండటం.. చెట్లు పొదలుగా పెరగడం వల్ల ఒక్క పాములే కాదు.., మండ్రకప్ప, తేలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. వాటి కాటుకు కూడా గురై పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రతి ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ పాములు, ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మనకు కనిపించే అన్ని పాములు విషపూరితం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తపింజర, త్రాచుపాము, కట్లపాము వంటి విషపాముల వల్లే ప్రమాదం ఉంటుందని.., దాదాపు 50 శాతానికిపైగా పాముల వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఏ పాము అయినా.., కాటేసిన వెంటనే వైద్యుని సంప్రదించాలి.
పాములన్నిటోకి నాగుపాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటువేస్తే 15 నిమిషాల్లో విషం ఎక్కుతుందని వైద్యనిపుణులు అంటున్నారు. ముందుగా పాముకాటు వేసిన చోట…విషం పైకి వెళ్లకుండా వెంటనే కట్టు కట్టాలి. ఆ తర్వాత దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి. నాగుపాము విషం ముఖ్యంగా మనుషుల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
రక్తపింజరి సాధారణంగా జనావాసాల్లో అంతగా కనిపించదు.. అటవీప్రాంతంలోనే ఎక్కువగా తిరుగుతుంది. అయితే ఈ పాము కాటు వేస్తే 2 గంటల తర్వాత విషం శరీరానికి ఎక్కుతుందని చెబుతున్నారు. రక్తపింజర కాటువేసిన వెంటనే తప్పనిసరిగా అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
కట్లపాము చూడటానికి దాని మీద కట్ కట్ మార్కులు కనిపిస్తున్నా.., అది ఒక్కసారి కాటువేసిందంటే వెంటనే దాని విషం రక్తంలో కలుస్తుంది. అందుకే దీని వల్ల ప్రాణాపాయం చాలా ఎక్కువ. కట్లపాము విషం రక్తంలోకి చేరకముందే చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది.
కంగారు వద్దు.., కాస్త ఆలోచించండి..!
పాముకాటుకు గురైన వారు ఎలాంటి టెన్షన్ పడొద్దు. అలా మీరు గానీ ఆందోళనకు గురైతే పాముకాటు సంగతి ఎలా ఉన్నా…గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాదు పాము కాటువేయగానే గాయాల పైభాగంలో బిగుతుగా కట్టుకట్టాలి. అలా కట్టడం వల్ల విషయం శరీరంలో పైకి చేరదు. కాస్త ప్రమాదం తక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా పాము కాటుకు గురైనప్పుడు...
ఏ పాము కాటు వేసిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్యులు. అప్పుడే తమకు చికిత్స చేయడం సులభంగా ఉంటుందంటున్నారు. ఆ విషానికి త్వరగా విరుగుడు ఇవ్వడం వల్ల పాముకాటుకు గురైన వ్యక్తిని ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. ప్రతి ప్రాథమిక కేంద్రాల్లోనూ ఈ విరుగుడు మందు అందుబాటులో ఉంది.
రాత్రుల్లు పొలాలకు వెళ్లే రైతులు కచ్చితంగా కాళ్లకు చెప్పులు, చేతిలో టార్చిలైట్లు తప్పనిసరి. అంతేకాదు కాస్త శబ్దాన్ని చేస్తూ వెళ్లాలి. లేదంటే మీ ఫోన్‌లో పాటలు పెట్టుకోని వెళ్ళడం వల్ల..ఆ అలికిడి పాము మీవైపు రాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Snake bite