Andhra Pradesh: ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం.. అనుమానాలు ఎన్నో.. అసలే జరిగిదంటే..?

గుంటూరు ప్రమాదం వెనుక ఎన్నో అనుమానాలు

ఒక ప్రమాదం ఆరుగుర్ని సజీవ దహనం అయ్యేలా చేసింది. అయితే అందుకు ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అని పోలీసులు అంటున్నారు. కానీ విద్యుత్ అధికారులు అలాంటి ఆనవాళ్లు లేవంటున్నారు..? ఇంతకీ కారణం ఏంటి..?

 • Share this:
  ఉపాధి కోసం వేల కిలోమీటర్లు దాటి వలస వచ్చిన కూలీల జీవితాలను ఓ ప్రమాదం బలితీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవ దహనమయ్యారు. రొయ్యల చెరువు దగ్గర ఒడిశాకు చెందిన వ్యక్తులు కాపాలాల ఉంటున్నారు. అయితే గురువారం రాత్రి అంతా రొయ్యల చెరువు దగ్గరే ఉన్న రేకుల షెడ్డులో నిద్రపోయారు. గాఢ నిద్రలోకి జారుకున్నాక కరెంట్ తీగలు రేకుల షెడ్డు మీద పడి షార్ట్ సర్క్యూట్ అయ్యిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నదానిపై పలు అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు ప్రాథమికంగా అది షార్ట్ సర్క్యూట్ ప్రమాదమని చెపుతున్నారు. కానీ విద్యుత్ అధికారులు మాత్రం అసలు అలాంటి ఆనవాళ్లు లేవు అంటున్నారు. మరి వారి మరణానికి అసలు కారణం ఏంటి? పోలీసులు చెబుతున్నది నిజం అయితే.. ఘటనా స్ధలానికి మీడియాను ఎందుకు అనుమతించడం లేదన్నది మరో ప్రశ్న. రేకుల షెడ్‌లో కెమికల్స్‌ ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. కెమికల్‌ బ్లాస్ట్‌ వల్లే ఈ ఆరుగులు ప్రాణాలు కోల్పోయారా.? అన్నది మిస్టరీగా మారింది. అసలు ఆ రూమ్ లో అంత బ్లీచింగ్ ఉంటే.. ఆ గదిలో వాళ్లంతా ఎలా నిద్రించారు అన్నది కూడా సమాధానం లేని ప్రశ్నే.. ఇంకా ఇలాంటి ప్రశ్నలు ఎన్నో చిక్కు ముడులగానే ఉన్నాయి.

  బ్లీచింగ్ పౌడర్ ఉన్న గదిలో కూలీలు ఎందుకు నిద్రించారన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. బ్లీచింగ్ పక్కన ఉంటేనే ఎక్కువసేపు ఆ వాసన చూడలేరు. వాసన ఇంట్లోకి వస్తుంది. అలాంటప్పుడు బ్లీచింగ్ ఉన్న రూమ్‌లో కూలీలు ఎలా నిద్రించారు అని స్థానికులు అనుమానిస్తున్నారు. మిగిలిన గదులు ఖాళీగా ఉన్నప్పటికీ.. ప్రమాదం జరిగిన గదిలోనే ఆరుగురు ఎందుకు నిద్రించారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన పక్క గదిలో మరో పది మంది కార్మికులు నిద్రిస్తుంటే.. ఘటన జరిగిన సమయంలో వారు కనీసం మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి లేకపోయారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. అక్కడ మొత్తం ఆరుగదులు ఖాళీ ఉంటే ..కెమికల్ డబ్బాలు ఉన్న గదిలో ఆరుగురు ఎందుకు పడుకున్నారన్నది కూడా అనుమానమే. ఆరుగురు మగవాళ్ళు గదిలో పడుకుంటే ముగ్గురు ఆడవాళ్లు బయట ఎందుకు పడుకున్నారు..? అక్కడ గదుల్లో ఏ ఒక్క దానికి అసలు తలుపు లేవు.. ఒకవేళ మంటలు చెలరేగితే బయటకు తప్పించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి..కానీ వీళ్ళు ఎందుకు కదల్లేకపోయారని ప్రశ్నిస్తున్నారు.

  అనుమానాలు సంగతి ఎలా ఉన్నా పోలీసుల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. రేపల్లె మండలం లంకెవానిదిబ్పలో అగ్ని ప్రమాద స్థలాన్ని ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. తరువాత ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ బ్లాస్టింగ్ జరిగిన ఆనవాళ్ళు లేవని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో గది నుండి ఇద్దరు బయటకు వచ్చినట్లు చెబుతున్నారని.. వాళ్ళిద్దరూ షాక్ లో ఉన్నారని చెప్పారు. బ్లీచింగ్ పౌడర్ ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ అధికారులు చెప్పారన్నారు. ప్రాధమిక ఆధారాల ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంగానే భావిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి అక్వా కంపెనీ ఓనర్, మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. అన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.
  Published by:Nagesh Paina
  First published: