సోమవారం తిరుమలకు వెళ్లిన భక్తులకు ఓ షాకింగ్ అనుభవం ఎదురయింది. అలిపిరి నడక మార్గంలో వెళ్తున్న భక్తులకు నాగుపాము కనిపించింది. ఏకంగా మెట్లపైనే అది తిష్టవేసుకుని ఉండటంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. కొద్ది సేపు ఆ పాము కలకలం సృష్టించింది. తిరుమల జీఎన్సీ టోల్ గేట్ కు కిలోమీటర్ వ్యవధిలో అటవీ ప్రాంతం ఉంది. ఆ అటవీ ప్రాంతం నుంచి నడక దారి వైపును ఆరు అడుగుల నాగుపాము వచ్చింది. మెట్లపైన ఉన్న నాగుపామును చూసి భక్తులు పరుగులు తీశారు. ఈ విషయం విజిలెన్స్ సిబ్బందికి తెలియడంతో వాళ్లు అప్రమత్తమయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు.
అలిపిరి నడకమార్గంలో నాగుపాము కలకలం సృష్టిస్తున్న సంగతిని తెలుసుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వెంటనే ఆ ఘటనా స్థలికి వచ్చేశారు. చాకచక్యంగా ఆ ఆరు అడుగుల నాగు పామును పట్టుకున్నారు. కొద్ది సేపు ఆ పాముతోనే విన్యాసాలు చేయించారు. నాగుపామును చేత్తో పట్టుకుని వెళ్తుండగా కాలి నడకన వెళ్తున్న భక్తులు వింతగా చూస్తూ ఉండిపోయారు. దాన్నో వింతగా చూశారు. భక్తులు భయపడొద్దని, ధైర్యం చెప్పి నాగుపామును దూరంగా తీసుకెళ్లారు. అవ్వాచారి కోణలో ఆ నాగుపామును సురక్షితంగా విడిచిపెట్టారు.
కాగా, తిరుమలలో పాములు ఎప్పుడు కలకలం సృష్టించినా స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు ఫోన్ వెళ్తుంది. తిరుమలలో భాస్కర్ నాయుడు ఓ సాధారణ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఓసారి పాము ఆయన ఉన్న ఆఫీసు వద్దకు వస్తే, మిగిలిన సిబ్బంది అంతా పరుగులు తీసినా, భాస్కర్ నాయుడు మాత్రం బెదరలేదు. ఆ పామును చేత్తోనే పట్టుకుని కాసేపు సరదాగా ఆడించారు. ఆ తర్వాత దాన్ని బయటకు అడవుల్లో వదిలిపెట్టారు. దీంతో ఎప్పుడు పాములు కలకలం రేపినా భాస్కర్ నాయుడుకు ఫోన్ వెళ్తుంది. అలా మొత్తానికి భాస్కర్ నాయుడు, ఆ ఉద్యోగం నుంచి తిరుమలలో స్నేక్ క్యాచర్ గా అవతారం ఎత్తారు. వాస్తవానికి పాములు మనల్ని చూసే భయపడుతుంటాయనీ, వాటికి అర్థమయ్యే భాషలో భయపడొద్దని చెప్పి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెడుతుంటానని ఆయన వివరిస్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Snake bite, Snakes, Tirumala Temple, Ttd news